సెర్ప్ లక్ష్యాల సాధనకు చర్యలు
కామారెడ్డి క్రైం: సెర్ప్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌లతో మాట్లాడా రు. యాసంగిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి మహిళా సంఘాలకు రావాల్సిన కమీషన్‌పై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్షించాలని, పెండింగ్‌లో ఉన్న కమీషన్ చెల్లించేలా చూడాలని సూచించారు. స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సెర్ప్ సమన్వయంతో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలి..
కలెక్టర్‌లు ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్నవారు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలన్నారు. డీఆర్డీవో, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. స్వశక్తి సంఘాలకు చెల్లించాల్సిన యూనిఫాంలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ వరకల్లా జిల్లా సమైక్య భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, మొదట జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు.


