రాజంపేట/ఎల్లారెడ్డిరూరల్/గాంధారి/తాడ్వాయి/లింగంపేట/నిజాంసాగర్/బిచ్కుంద: రుణమాఫీ కాని రైతులందరికి మాఫీ చేయాలని పలు మహాజన సభల్లో తీర్మానం చేశారు. శుక్రవారం అర్గొండలో సింగిల్ విండో చైర్మన్ కందిశివరాములు, రాజంపేటలో నల్లవెల్లి అశోక్‌ల అధ్యక్షతన మహాజనసభలు నిర్వహించారు. రాజంపేట సొసైటీకి కేటాయించిన ఐదు ఎకరాల భూమిలో ఉపాధి హామీ పనుల చేపట్టాలని, అదే విధంగా సొసైటీ పరిధిలో కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. రైతులకు ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ నర్సింలు అన్నారు. సొసైటీ ఆవరణలో నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా కాకుండా సొసైటీల ద్వారానే ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని కోరారు. సహకారం సంఘంలో తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని గాంధారి విండో చైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ సాయికుమార్ అన్నారు.
స్థానిక సహకార సంఘం భవనంలో చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన మహాజన సభలో ఆయన మాట్లాడారు.పేట్‌సంగెంలో త్వరలో గోదాం నిర్మాణ పనులు చేపడతామన్నారు.తాడ్వాయి సింగిల్ విండో కార్యాలయంలో విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంఘాలకు కొనుగోలు సెంటర్లను అప్పజెప్పితే సొసైటీలు నష్టాల బాటలో నడుస్తాయన్నారు.దీర్ఘకాలిక రుణాలు జూలై నెలాఖరు వరకు ఒకే దఫాలో చెల్లించే వెసలు బాటు కల్పించాలని తీర్మానం చేశారు.లింగంపేట మండలం నల్లమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ చైర్మన్ రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు.నిజాంసాగర్ మండలం అచ్చంపేట రైతు వేదికలో సొసైటీ మహాజన సభను చైర్మన్ కయ్యం.నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. బిచ్కుంద మహాజన సభను చైర్మన్ బాలాజీ శ్రీహరి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం రైస్‌మిల్ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం, జొన్న కొనుగోలు కేంద్రం త్వరగా ప్రారంభించాలని తీర్మానం చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసందర్భంగా కార్యదర్శులు జమ ఖర్చులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు, కార్యదర్శులు, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సొసైటీల ద్వారానే
ధాన్యం కొనుగోలు చేపట్టాలి
మహాజన సభల్లో తీర్మానం


