భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.15లక్షల వరకు బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడి సీసీ కెమెరాల కేబుల్స్‌ను కత్తిరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఒక ఇల్లు తర్వాత ఇంకో ఇల్లు తాళాలు పగులగొడుతూ సుమారు తొమ్మిది ఇళ్లలో చోరీ చేశారు. దాకి రమేశ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, వెండి వస్తువులను దొంగిలించారు. పక్కన ఉన్న నాగమణి ఇంట్లో మూడు తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మామిడి సత్తమ్మ ఇంట్లో అర తులం బంగారం, రూ.5 వేలు నగదు, సుజాత ఇంట్లో రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. సువర్ణ ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు, మన్నె దర్మరాజు ఇంట్లో తులం బంగారం, రూ.50 వేల నగదు దోచుకెళ్లారు. చంద్రయ్య ఇంట్లో తులం బంగారం, రూ.పది వేల నగదు, చింత వినయ్ ఇంట్లో రూ.6 వేలు నగదు, సొన్నాయల స్వామి ఇంట్లో నగదు, ఇళ్ల ముందు ఉన్న బైకును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. మొత్తంగా సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాలకు వెళ్లి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
తాళాలు వేసిన తొమ్మిది ఇళ్లలో చొరబడ్డ దుండగులు
సుమారు రూ.15లక్షల బంగారం, నగదు అపహరణ


