● కనుమరుగవుతున్న ఎడ్లబండ్లు
● ఉగాది ఎడ్లబండ్ల ప్రదర్శన కోసం అద్దెకు తీసుకుంటున్న భక్తులు
నాగిరెడ్డిపేట: అన్నదాతకు తోడుగా ఉండే కాడెద్దులు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో రైతులు సైతం కాడెద్దులను వీడి ట్రాక్టర్ల బాటపట్టారు. ఫలితంగా కాడెద్దుల బండ్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఒకరిద్దరి వద్ద మాత్రమే ఎడ్లు, బండ్లు ఉంటున్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో జరిగే జాతరల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనే ప్రధానం. ప్రస్తుతం ఎడ్లబండ్ల ఉనికి లేకపోవడంతో ఉత్సవాల కోసం వేల రూపాయలు వెచ్చించి ఇతర గ్రామాల నుంచి ఎడ్లబండ్లను అద్దెకు తీసుకొస్తున్నారు. మరికొందరు లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఎడ్లబండ్ల ప్రదర్శన ముగిసిన తర్వాత వాటిని అమ్మేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట్‌లో ఉగాది వేడుకలను ఏటా వైభవంగా నిర్వహిస్తారు. నాగిరెడ్డిపేట, గోపాల్‌పేట, చీనూర్, వాడి, లింగంపల్లి, మాల్తుమ్మెద, గోలిలింగాల, వదల్‌పర్తి, బంజర తదితర గ్రామాలకు చెందిన భక్తులు గోపాల్‌పేటకు వచ్చి శ్రీ నల్లపోచమ్మ ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. ఒక్కో జత ఎడ్లకు రూ.3వేలు నుంచి రూ.5వేలు చెల్లించి, ఒక్కో బండికి నాలుగైదు జతల ఎడ్లను కట్టి ప్రదర్శనలో తిప్పుతారు. ఇలా ఉత్సవాల్లో ఎడ్లబండిని తిప్పడానికి సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండడం విశేషం.
లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన కలాలి గోపాల్‌గౌడ్ గోపాల్‌పేటలో జరిగే ఉగాది ఉత్సవాలకు రూ.1.85 లక్షలు వెచ్చించి రెండు జతల ఎడ్లను కొనుగోలు చేశాడు. ప్రదర్శన అనంతరం ఎడ్లను తిరిగి అమ్మేస్తానని గోపాల్‌గౌడ్ తెలిపారు.
కాడెద్దులు @ రూ.3వేలు


