ప్రజా మరుగుదొడ్లేవి?
● బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ లేక
మండల ప్రజల ఇబ్బందులు
● పట్టించుకోని అధికారులు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.
పెరుగుతున్న వ్యాపారం, జనాభాకు అనుగుణంగా మండల కేంద్రంలో అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఎక్కడ ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. గ్రామ స్వచ్ఛతకు అందరు సహకారం అందించాలి, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయవద్దని పంచాయతీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదు. ఇతర గ్రామస్తులు, దుకాణాల్లోని సిబ్బందికి ఎవరికై నా ఒంటికి, రెంటికీ వస్తే ఆర్టీసీ బస్టాండ్‌కు రావాల్సిందే. వ్యాపారులు దుకాణాలను వదిలి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. పలువురు ఖాళీ స్థలాల్లో మూత్రవిసర్జన చేపట్టడంతో పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కనీసం రెండు సులభ్ కాంప్లెక్స్ నిర్మించి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
మండల కేంద్రంలో పలువురు బహిరంగ ప్రదేశాల్లోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ కావాలని ఉన్నతాధికారులకు గతంలో ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం రెండు సులభ్ కాంప్లెక్స్‌ల అవసరం ఉంది. సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
– శ్రీనివాస్‌గౌడ్, జీపీ కార్యదర్శి, బిచ్కుంద
ప్రజా మరుగుదొడ్లేవి?
ప్రజా మరుగుదొడ్లేవి?


