పైకి వచ్చేదెలా?
అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా ప్ర‘జల’ కష్టాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. పాతాళంలోంచి నీళ్లను తోడడమే తప్ప.. భూగర్భ జలాలను వృద్ధి చేసేందుకు సరైన ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో ఏటా వేసవిలో బోరుబావులు ఎత్తిపోతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
కామారెడ్డి పట్టణం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరుగడించింది. విద్య, వైద్య రంగంలోనూ ముందుకు వెళుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా చాలా మంది కామారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో పట్టణం నలువైపులా విస్తరించింది. మున్సిపాలిటీ పరిధిలో 30 వేల ఇళ్లు ఉన్నాయి. అద్దెకు ఉన్న కుటుంబాలతో కలిపి పట్టణ జనాభా లక్షా ఇరవై వేలకు చేరింది. కాగా కామారెడ్డి పట్టణంలో ఇళ్లు నిర్మాణం మొదలు పెట్టాలంటే ముందు బోరు తవ్వాల్సిందే. పట్టణంలోని అశోక్‌నగర్, శ్రీనివాస్‌నగర్, స్నేహపురికాలనీ, శ్రీరాంనగర్, విద్యానగర్, కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల నుంచి 1,500 అడుగుల దాకా బోర్లు తవ్వుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టేవారు వెయ్యి ఫీట్లు తవ్వితే ఇరుగు పొరుగు ఇళ్లలో అప్పటికే తక్కువ లోతు తవ్విన బోర్లు ఎత్తిపోతున్నాయి. వర్షాకాలం ఎలాగోలా గడిచిపోతున్నా వేసవి సీజన్ ప్రారంభం కాగానే బోర్లు ఎతిపోయి నీటి కష్టాలు మొదలవుతున్నాయి.
ఇంకుడు గుంతలు లేని కాలనీ
జిల్లాకేంద్రంలో వెయ్యి అడుగుల
లోతు వరకు బోర్ల తవ్వకాలు
కొన్నిచోట్ల 1,500 అడుగుల లోతు
వరకు తవ్వినా ఫలితం శూన్యం
రోజురోజుకు పడిపోతున్న
భూగర్భ జలాలు
ఇంకుడు గుంతలపై
దృష్టి సారించని సర్కారు, ప్రజలు
ఫలితంగా ఏటా వేసవిలో
తప్పని నీటి కష్టాలు
ఇంటికో ఇంకుడు గుంత ఉండాలి
సాధారణంగా నీరు ఉన్నప్పుడు ఎవరూ నీటి విలువను గుర్తించడం లేదు. సమస్య తలెత్తినప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. పట్టణమైనా, పల్లెల్లోనైనా నీటి వృథాను అరికట్టాలి. అలాగే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. వర్షపునీరు, ఇంట్లో వదిలేసిన నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకి బోర్లలో నీటి ఊటలు పెరుగుతాయి. ఇంకుడు గుంత ఉంటే నీటిని నిల్వ చేసుకున్నట్లే..
– సతీశ్ యాదవ్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి
పైకి వచ్చేదెలా?


