ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
రామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముగ్గుపోశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని, పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో మురళి, డీఎల్‌పీవో శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి సంజయ్‌కుమార్, హౌసింగ్ పీడీ విజయ్‌పాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ సురేందర్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈవో ఆనంద్‌రావు, ఆర్‌ఐ రవికాంత్, ఏపీవో ధర్మారెడ్డి, వ్యవసాయ అధికారిణి భాను శ్రీ, ఏపీవో ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గురువారం పలు శాఖల అధికారులు, మండల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్‌ఆర్‌ఎస్, ధరణి, సన్న బియ్యం, గ్రామ పాలన అధికారుల ఎంపిక, తదితర అంశాలపై అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం కోసం మండల స్థాయిలో కమిటీలను రూపొందించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూర్చాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలి
రాజంపేట: వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై పుష్పరాజ్ గురువారం తెలిపారు. సెలవుల్లో చెరువులు, బావులలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. స్మార్టు ఫోన్‌లకు దూరంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బైక్ తాళాలు ధ్వంసం
భిక్కనూరు: మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నిలిపి ఉంచిన ఐదు బైక్‌ల తాళాలను దుండగులు గురువారం వేకువ జామున ధ్వంసం చేశారు. బైక్‌ల తాళాలను ధ్వంసం చేసిన వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.


