కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
కామారెడ్డి క్రైం : యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకోసం 446 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 33 కేంద్రాలను ప్రారంభించామని, ధాన్యం సేకరణ మొదలుపెట్టి 686 టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. మిగతా కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, క్యాలీపర్స్‌లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు.
రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించాలి
పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను వార్డు అధికారులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులను జీపీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన వాటిని రెవెన్యూ సిబ్బంది పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సరిచూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఆఫీసర్స్ పరిశీలించాలన్నారు. సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌లు రాజేందర్‌రెడ్డి, శ్రీహరి, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
జొన్న కొనుగోలు కేంద్రాలకోసం..
జిల్లాలో 15 జొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వంనుంచి అనుమతులు రాగానే జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మార్కెటింగ్ అధికారి రమ్య, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అవసరమైన అన్ని సౌకర్యాలు
కల్పించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


