మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. ఏర్గట్లకు చెందిన కొన్ని యువజన సంఘాలు ప్రజల నుంచి విరాళాలు సేకరించి శివాజీ విగ్రహాన్ని తయారు చేయించాయి. బస్టాండ్ ప్రాంతంలోని తెలంగాణ తల్లి విగ్రహం పక్కన శివాజీ విగ్రహాన్ని నిలిపిఉంచారు. శుక్రవారం ఉదయం విగ్రహాన్ని ఆవిష్కరించి గద్దె నిర్మాణం పనులు ప్రారంభించారు. కానీ పోలీసులు వచ్చి విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని పనులను అడ్డుకున్నారు. ఎవరి అభ్యంతరం లేకపోయినా పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు నిరసన తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలను జరిపారు. 10 రోజుల్లో అనుమతి తీసుకోవాలని సూచించి, విగ్రహానికి ముసుగువేశారు. అనుమతి తీసుకున్న తర్వాతనే విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించడానికి యువజన సంఘాల సభ్యులు అంగీకరించడంతో వివాదం ముగిసిపోయింది. ఇదిలా ఉండగా ఆవిష్కరించిన రోజునే శివాజీ విగ్రహాంపై ముసుగు వేయడం కాకతాళీయంగా చోటు చేసుకుంది.
శివాజీ విగ్రహావిష్కరణపై వివాదం


