బాన్సువాడ : తైబజారు పేరుతో జోరుగా వసూళ్ల దందా సాగుతోంది. వారాంతపు, రోజు వారీ సంతల్లో ఉత్పత్తులను విక్రయించేందుకు వెళ్తే కాంట్రాక్టర్లు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. సంతల ద్వారా బల్దియాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. అయితే వసతులు కల్పించే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
రూ. 67 లక్షల ఆదాయం
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి గురువారం పశువులు, గొర్రెలు, మేకలతో పాటు కూరగాయల సంత నిర్వహిస్తారు. ఇటీవల సంతలకు వేలం నిర్వహించారు. కాంట్రాక్టర్లు మేకల సంతను రూ. 46.26 లక్షలకు, కూరగాయల సంతను రూ.12.31 లక్షలకు, రోజువారి సంతను రూ.9.02 లక్షలకు సొంతం చేసుకున్నారు. సంతల వేలం ద్వారా బల్దియాకు రూ. 67 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఇంత ఆదాయాన్ని సమకూర్చిన సంతలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. తైబజార్ పేరిట ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వ్యాపారులు, ప్రజలు పేర్కొంటున్నారు. మేకలకు నీటి సౌకర్యం కల్పించినా అది సరిపోవడం లేదని అంటున్నారు. అలాగే మూత్రశాలలు ఉన్నా నిర్వహణ సరిగా లేక దుర్వాసన వస్తున్నాయని పేర్కొంటున్నారు. కూరగాయల సంత నిర్వహణకు సరైన స్థలం లేదు. దీంతో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా, పాత బాన్సువాడకు వెళ్లే దారిలో రోడ్లపైనే కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి సంతలో సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
తైబజారు పేరుతో జోరుగా వసూళ్లు
కనీస వసతులు కల్పించడంలో విఫలం
ఇబ్బందిపడుతున్న వ్యాపారులు, ప్రజలు
తాగేందుకు నీళ్లు కూడా లేవు..
రోజు బాన్సువాడకు వచ్చి కూరగాయలు అమ్ముతాం. ఇక్కడ కనీసం తాగేందుకు నీళ్లు కూడా అందుబాటులో ఉంచరు. డబ్బులు మాత్రం వసూలు చేస్తారు. కూరగాయలు అమ్ముడుపోకున్నా డబ్బులు ఇవ్వాల్సిందే.
– సుజాత, కూరగాయల విక్రేత, బండాపల్లి
మూత్రశాలలు లేవు
రోజూ ఉదయమే బాన్సువాడకు కూరగాయలు తీసుకుని వస్తాం. ఎండలో కూర్చొని అమ్ముతాం. ఇక్కడ కనీసం మూత్రశాలలు కూడా లేవు. దీంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంతలో సౌకర్యాలు కల్పించాలి.
– బుజ్జమ్మ, కూరగాయల విక్రేత, బండాపల్లి


