చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
ఎడపల్లి(బోధన్): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వలకు చిక్కుకొని, నీటమునిగి మృతి చెందాడు. ఎస్సై వంశీచందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌కు చెందిన శ్రీనివాస్ (28) బోర్‌బండి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ములుగు జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి 18ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. పనిలేనప్పుడు చేపలు పట్టడానికి వెళుతుండేవాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చేపల వేటకని స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు వల వేయగా, అదే వలకు చిక్కుకొని నీటమునిగి మృతిచెందాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్నానానికి వెళ్లి చెరువులో పడి ఒకరు..
బాల్కొండ: ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ యువకుడు స్నానం చేయడానికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చింతకాయల చరణ్(18)కు మతిస్థిమితం సరిగా ఉండదు. సోమవారం ఉదయం అతడు స్థానిక ఊర చెరువులో స్నానం చేయడానికి వెళ్లి, ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లగా అతడి దుస్తులు ఒడ్డున ఉండటంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ముప్కాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పదేళ్ల క్రితం ఇద్దరు కుమారులు..
కొత్తపల్లి గ్రామానికి చెందిన చింతకాయల రవి, రజిత దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. వారిలో ఇద్దరు కుమారులు గత పదేళ్ల క్రితం ఊర చెరువు నుంచి ప్రవహించే కాలువలో పడి మృతి చెందారు. పెద్ద కుమారుడైన చరణ్ చెరువులో పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
నల్లమడుగులో క్షుద్ర పూజల కలకలం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపింది. పాఠశాలకు శని, ఆదివారాలు సెలవులు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని ఓ గది వద్ద ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అరటిపండ్లు, నిమ్మకాయలతో పట్టు వేసినట్లు బొమ్మలను వేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలతో చర్చించి లింగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు హెచ్‌ఎం కోటేశ్వర్‌రావు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామ శివారు మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను తహసీల్దార్ దశరథ్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్
బాన్సువాడ: బీర్కూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల– హాస్టల్ నుంచి 8వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు ప్రిన్సిపాల్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు అతడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి స్నేహితులను విచారించగా సదరు విద్యార్థులు కిష్టాపూర్‌లో యూనిఫామ్ మార్చుకుని గౌరారం గ్రామంలోని తోటి స్నేహితుడి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. ఆ గ్రామం పరిసర ప్రాంతంలో వెతుకగా వారి ఆచూకీ దొరకలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి


