అంబేడ్కర్ జయంతి బ్రోచర్ ఆవిష్కరణ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. ఈమేరకు మంగళవారం తెయూలో కార్యక్రమ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి హాజరవుతున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఇంటిని కూల్చిన కేసులో నలుగురి రిమాండ్
వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత నెలలో బచ్చు గంగాధర్ అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూల్చిన కేసులో మంగళవారం నలుగురు గ్రామస్తులను రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. మచ్చర్ల నర్సారెడ్డి, ఏనుగు మోహన్‌రెడ్డి, రిక్క రాజేశ్వర్, ఏనుగు నర్సారెడ్డి లను రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ జైల్లో కొందరు రిమాండ్‌లో ఉండగా, మరికొంత మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.
వృద్ధుడి అదృశ్యం
మాచారెడ్డి: ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలోత్ రాజ్య(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. మార్చి 31న మహారాష్ట్రలోని పౌరాదేవి దర్శనం కోసం వెళ్లిన రాజ్య ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
అంబేడ్కర్ జయంతి బ్రోచర్ ఆవిష్కరణ


