యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత
మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్(ఎం), సోమారంపేట, ఎల్లంపేట, రత్నగిరిపల్లి తదితర గ్రామాల పరిధిలో అడవి దట్టంగా ఉండేది. కలప స్మగ్లర్ల వేటుకు అడవంతా ఎడారిగా మారింది. అడవిని విచ్చలవిడిగా నరకడం వలన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమైంది. అడవిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మండలంలోని ఘన్‌పూర్ అటవీ ప్రాంతంలో దుండగులు టేకు చెట్లను నరికి తరలించుకుపోయిన ఆనవాళ్లున్నాయి.
ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారు
కామారెడ్డి–సిరిసిల్లా రహదారికి అనుకున్న ఉన్న ఘన్‌పూర్(ఎం) అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే యధేచ్ఛగా టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారని విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా టేకు చెట్లను నరికి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టించుకోకుండా, తరతరాలుగా హక్కు పత్రాలు కలిగి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దహనసంస్కారాలకు అవసరమైన కలపను తీసుకువెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని ఘన్‌పూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వనసంరక్షణ సమితులను ఏర్పాటు చేసి అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు.
చోద్యం చూస్తున్న అధికారులు
పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం
అటవీ ప్రాంతంలో ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. టేకు కలప నరికితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. దహన సంస్కారాల కోసం తీసుకెళ్లిన కలపను తమ సిబ్బంది స్వాధీనం చేసుకోలేదు.
– దివ్య, ఎఫ్‌ఆర్వో, మాచారెడ్డి
యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత


