నేటి నుంచి జొన్న కొనుగోళ్లు
కామారెడ్డి క్రైం: ‘జొన్న రైతుకేది మద్దతు’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. క్వింటాల్‌కు రూ.3,371 మద్దతు ధర చెల్లిస్తూ శుక్రవారం నుంచి జొన్నలు కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్ లోని దళారులకు తమ పంటను విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, పుల్కల్, పెద్ద కొడప్‌గల్, చిన్న కొడప్‌గల్, బోర్లం, కారేగాం, గున్‌కుల్, తిమ్మానగర్, గాంధారి, ముదెల్లి, ఆర్గొండ, పద్మాజీవాడి, ఎల్లారెడ్డిలలో కేంద్రాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఇంకా ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు అవసరమైతే తమ దృష్టికి తీసుకువస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. తేమ శాతం 14కు మించకుండా జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
16 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
క్వింటాల్ మద్దతు ధర రూ.3,371
వెల్లడించిన మార్క్‌ఫెడ్
జిల్లా మేనేజర్ మహేశ్


