అత్త భూమికి కోడలు ఎసరు !
మాచారెడ్డి : అత్త పేరిట ఉన్న 24 గుంటల భూమిని కాజేసేందుకు కోడలు ప్లాన్ వేసి అమలు చేసింది. అత్తకు బదులు మరో మహిళను తీసుకువెళ్లి భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ ఘటన పాల్వంచ మండలం మంథని దేవునిపల్లిలో జరిగింది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దేవునిపల్లికి చెందిన మంత పుష్పలత పేరుపై 24గుంటల పట్టా భూమి ఉంది. ఆ భూమిని తనపేరుపై చేసుకోవాలనుకున్న ఆమె కోడలు విజయ ఈనెల 8వ తేదీన మరో మహిళను పాల్వంచ తహసీల్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమెనే పుష్పలతగా నమ్మించింది. సర్వేనంబరు 299/1లో ఉన్న 7 గుంటలు, 330/2లో ఉన్న 9 గుంటలు, 74/2లో ఉన్న మరో 8 గుంటలు మొత్తం 24 గుంటల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. తహసీల్ కార్యాలయానికి విజయ తీసుకెళ్లిన మహిళ వేలిముద్రలు రాకపోవడంతో పుష్పలత ఫోన్‌కు ఓటీపీ పంపించి, తన కూతురు ద్వారా ఓటీపీ తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయ కానిచ్చింది. ఈ విషయం తెలిసిన పుష్పలత కోడలు తనను మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై పాల్వంచ తహసీల్దార్ హిమబిందును వివరణ కోరగా.. ధరణి పోర్టల్ ద్వారా పుష్పలత ఫోన్ నంబరుకు ఓటీపీ వెళ్లడంతో నంబర్ చెప్పారని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్ తెలిపారు.
తనకు బదులు మరొకరిని
తీసుకెళ్లి రిజిస్ట్రేషన్
లబోదిబోమంటూ పోలీసులను
ఆశ్రయించిన బాధితురాలు


