కలిసికట్టుగా పోరాటం
తెయూలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిందే
● విద్యార్థి సంఘాలు, పూర్వ
విద్యార్థుల డిమాండ్
● కలిసికట్టుగా పోరాడేందుకు
త్వరలో కార్యాచరణ
● ‘సాక్షి’ చర్చాగోష్టిలో
ముక్తకంఠంతో వెల్లడి
తెయూ(డిచ్‌పల్లి)/నిజామాబాద్ అర్బన్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తెయూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చాగోష్టిలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వర్సిటీ పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి యూనివర్సిటీ సాధించుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, విద్యార్థుల మనోభావాలను గుర్తించి దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం పేరుతో తెలంగాణ యూనివర్సిటీ మంజూరు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే ఓయూ, కేయూ తర్వాత మూడో అతిపెద్ద యూనివర్సిటీ తెయూ అని, 577 ఎకరాల సువిశాల ప్రాంగణం వర్సిటీ సొంతమన్నారు. తెయూ ఏర్పడి 18ఏళ్లు గడిచినా జిల్లా ప్రజాప్రతినిధుల అసమర్థతతోనే ఇంతవరకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిసారి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశాన్ని ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసే వరకు విద్యార్థి సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి కలసికట్టుగా పోరాడాలని, అందుకోసం త్వరలోనే కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు.
జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు..
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు విషయమై జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. చిన్నచిన్న జిల్లాలకు ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. వసతి, సౌకర్యాలపరంగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరం. ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుపై అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ ఒక్కరే మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడిన పాపాన పోలేదు. – పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు
కలిసికట్టుగా పోరాటం
కలిసికట్టుగా పోరాటం


