ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందికి సన్మానం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పేట్‌సంగెం గ్రామస్తులు ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందిని శనివారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వాపూర్ సెక్షన్ పరిధిలోని పేట్‌సంగెంలో గత నెల 8న పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యవసాయ బోరుబావులకు విద్యుత్ లైన్లు, స్తంభాలను సరిచేశారు. అవసరం ఉన్న చోట నూతన స్తంభాలను అమర్చారు. కిందికి వేలాడుతున్న తీగలను సరి చేశారు. దీంతో ట్రాన్స్‌కో సేవలను గుర్తించిన గ్రామస్తులు శనివారం ఎల్లారెడ్డి డీఈ విజయ సారధి, ఏడీఈ చీకోటీ మల్లేష్, సర్వాపూర్ ఏఈ లక్ష్మయ్య, లైన్‌మెన్లు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, సహాయ లైన్ మెన్లు కుమార్, సంతోష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కత్తూరి శ్రీను, భాను గౌడ్, మాణిక్ రావు, రామాగౌడ్ పాల్గొన్నారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
జక్రాన్‌పల్లి: జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాంచందర్ (50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. నిజామాబాద్‌లో నివాసం ఉంటున్న రాంచందర్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికాగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికి త్స పొందుతున్న రాంచందర్‌కు శనివారం గుండెపోటు రావడంతో మరణించాడు. మూడేళ్లుగా జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రాంచందర్ స్వస్థలం కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ తండా. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రాంచందర్ మృతి పట్ల జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు వెంకట్‌కుమార్, సుశీల్‌కుమార్, సిబ్బంది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బందికి సన్మానం


