ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించడానికి కృషి
నిజాంసాగర్/బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకం, మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ సీఎంసీ ఆస్పత్రి పెడియాట్రిక్ డాక్టర్ వినోద్‌షా స్వచ్ఛంద సేవా బృందంతో కలిసి ఎమ్మెల్యే శనివారం బిచ్కుంద ఆస్పత్రి సందర్శించారు. ప్రతి రోజు ఎంత మంది డయాలసిస్ రోగులు వస్తున్నారని, ఇతర వివరాలను సూపరింటెండెట్ కాళిదాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ఆస్పత్రులకు డాక్టర్ వినోద్ షా బృందం సందర్శించనున్నారు. ఈస్వచ్ఛంద సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించనున్నారని అన్నారు. బిచ్కుంద 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయిందని, త్వరలోనే స్థలం గుర్తించి పనులు ప్రారంభిస్తామన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బృందంతో కలిసి స్థానిక వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆస్పత్రులు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యులు, స్టాప్ నర్స్‌లు, వైద్య సిబ్బంది పోస్టుల భర్తీ, వైద్య సేవల తీరు తెన్నులను తెలుసుకున్నారు. ఆస్పత్రులు ఉన్నా వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదన్నారు. సంగారెడ్డి– నాందేడ్ జాతీయ రహదారి ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరమైన వైద్యం లేక సంగారెడ్డి, నిజామాబాద్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని వైద్య బృందం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా ప్రైవైట్ పరంగా ఆస్పత్రుల బలోపేతం, మెరుగైన వైద్యసేవలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్‌రెడ్డి, దర్పల్ గంగాధర్, సాయిని అశోక్, యోగేష్, డాక్టర్లు కాళిదాస్, రాకేష్, స్వప్నాలి ఉన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే
తోట లక్ష్మీకాంతారావు
స్వచ్ఛంద సేవ బృందంతో
బిచ్కుంద ఆస్పత్రి సందర్శన


