
ప్రాణాలు తీసిన చేపల వేట
నందిపేట్(ఆర్మూర్): చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రమాదవశాత్తు బావాబామ్మర్దులు ఇద్దరు నీట మునిగి చనిపోయిన ఘటన నందిపేట మండలం సిద్దాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన షేక్ షాదుల్లా(46) తన కుటుంబంతో కలిసి 18 ఏళ్ల క్రితం ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి వచ్చి మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప జిల్లా పొద్దుటూర్‌కు చెందిన అతని బావమరిది మహమ్మద్ రఫీక్(47) రంజాన్ పండుగ సందర్భంగా వారం క్రితం మచ్చర్లకు వచ్చాడు. కాగా, శుక్రవారం సాయంత్రం సరదాగా చేపలు పట్టేందుకు ఇద్దరూ కలిసి నందిపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులోని చిన్నవాగు సంబంధించిన మునికుంటకు వెళ్లారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు రఫీక్ కాలు జారి కుంటలో పడిపోయాడు. దీంతో అతనిని రక్షించేందుకు షాదుల్లా కుంటలోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం, మునికుంటలో లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగి మృతి చెందారు. మృతుడు షేక్ షాదుల్లా కొడుకు షేక్ సులేమాన్ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
ప్రమాదవశాత్తు కుంటలో పడి
ఇద్దరి దుర్మరణం
మృతులిద్దరూ బావాబామ్మర్దులు

ప్రాణాలు తీసిన చేపల వేట