ఉపాధ్యాయ ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయ ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో, అనేక సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని క్యాన్సర్‌తో చనిపోయిన టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి రమణ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలో జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చారు. ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హౌసింగ్ బోర్డులోని ఆయన నివాసం నుంచి పెద్ద చెరువు దిగువన ఉన్న శ్మశాన వాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. అంత్యక్రియల వద్ద పలువురు ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు టి.హన్మాండ్లు, వై.అశోక్‌కుమార్, కే.వేణుగోపాల్, అనిల్‌కుమార్, తిరుపతి, కొంగల వెంకటి, ప్రకాశ్, లచ్చయ్య, శ్రీధర్, రాంచంద్రం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, ప్రముఖ రచయిత్రులు కాత్యాయని, తుర్లపాటి లక్ష్మి, వివిధ సంఘాల ప్రతినిధులు జి.జగన్నాథం, శ్యాంరావ్, క్యాతం సిద్దరాములు, శంకర్ తదితరులున్నారు.
కందుకూరి రమణ అంత్యక్రియలకు
తరలివచ్చిన టీచర్లు, ప్రజాసంఘాల నేతలు


