పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామ శివారులో ఓ రైతు సుమారు రెండు ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని వడ్లం గ్రామానికి చెందిన మల్లయ్యల హన్మండ్లు తనకున్న 2.20 ఎకరాలల్లో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. సోమవారం పొలం దగ్గరకు వెళ్లి చూడగా చేతికొచ్చిన పంటంతా కాలిపోయింది. పంటను అమ్మి అప్పులు తీర్చుకుందామంటే అగ్ని ప్రమాదంతో కష్టమంతా బూడిదపాలయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.లక్ష 50వేల నష్టం అయిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
రేపల్లెవాడలో గుడిసె..
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని రేపల్లెవాడలో గ్యాస్ సిలెండర్ పేలి గుడిసె దగ్ధమైనట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు. గ్రామంలోని కుమ్మరి తిరుపతికి చెందిన గుడిసెలో అకస్మాత్తుగా గ్యాస్ సిలెండర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో ఇంట్లోని దుస్తులు, వంటసామగ్రి, అరతులం బంగారం, 20 తులాల వెండి కాలిబూడిదైనట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
మొక్కజొన్న పంట దగ్ధం