వేసవి క్రీడా శిబిరాలకు వేళాయే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో జిల్లా యువజన, క్రీడల శాఖ వేసవి క్రీడాశిబిరాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఇన్నాళ్లు పుస్తకాలతో దోస్తి చేసి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వేసవిసెలవుల్లో ఆటలపై పట్టు సాధించేలా ఈ శిబిరాలను ఏర్పాటు చేయనుంది. క్రీడాశిబిరాల నిర్వాహణ కోసం ఆసక్తి గల సీనియర్ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు, పీఈటీ, పీడీల నుంచి సంబంధిత అధికారులు ఇదివరకే దరఖాస్తులను సైతం స్వీకరించారు.
14ఏళ్లలోపు బాలబాలికలకు..
క్రీడలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో 10 శిబిరాలను అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మే 1నుంచి 31వరకు శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. 14ఏళ్లలోపు బాలబాలికలకు ఎంపిక చేయబడ్డ క్రీడలలో నెలరోజులపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. నెలరోజులపాటు శిబిరాలను నిర్వహించేవారికి రూ.4వేలు పారితోషికంగా చెల్లించడంతోపాటు శిబిరాల నిర్వాహణకు అవసరమైన క్రీడాసామగ్రిని పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు మరో పది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈక్రమంలో వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా, వారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలను వెలికితీయడంతోపాటు క్రీడలపై వారికి తగిన శిక్షణ ఇచ్చేలా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు.
జిల్లాలో పది కేంద్రాల ఏర్పాటుకు
అధికారుల కసరత్తు
మే 1 నుంచి 31 వరకు
కొనసాగనున్న శిక్షణ


