నీటి సమస్య లేకుండా చర్యలు
● ఆర్‌డీఎంఏ షాహీద్ మసూద్
● మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(ఆర్‌డీఎంఏ) షాహీద్ మసూద్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో రెండు రోజులకోసారి పుష్కలంగా కుళాయిల ద్వారా నీటి సరఫరా అవుతోందని, కొన్ని కాలనీల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్నారు. నీటి ఎద్దడి ఉన్న కాలనీలకు ప్రస్తుతం 10 ట్యాంకర్ల ద్వారా నీటిని చేస్తున్నారన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఆయా కాలనీల్లో నీరు రావడం లేదన్నారు. తీవ్ర నీటిఎద్దడి ఉన్న కాలనీల్లో నీటి సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అభివృద్ధి అంశాలు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఆర్‌వో రవిగోపాల్, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


