భూ భారతిలో మూడంచెల వ్యవస్థ
● చట్ట ప్రకారమే సమస్యల పరిష్కారం
● రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్
● లింగంపేట మండలంలో
అందుబాటులోకి వచ్చిన పోర్టల్
● గ్రామాల్లో దరఖాస్తులు
స్వీకరించిన అధికారులు
లింగంపేట(ఎల్లారెడ్డి): దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భా రతి పోర్టల్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పోర్టల్‌ను నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాగా, అందులో లింగంపేట మండలం ఒకటి. కాగా, మండలంలోని పోతాయిపల్లిలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బోనాల్ గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఆర్డీవో మన్నె ప్రభాకర్ పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేసి భూ భారతి పోర్టల్‌పై అవగాహన కల్పించారు. పోతాయిపల్లిలో అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తులను పరిశీలించి చిన్నచిన్న సమస్యలను ఏడు రోజుల్లో పరిష్కరిస్తామని, ఏడు రోజుల్లో సమస్య పరిష్కారం కానిపక్షంలో మొదటి అప్పీలు ఆర్డీవోకు చేసుకోవచ్చని, 30 రోజుల్లో పరిష్కారం కానిపక్షంలో ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. గతంలో పౌతి, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల వివాదాల పరిష్కా రం కోసం కోర్టుకు వెళ్లేవారని, ప్రస్తుతం భూ భారతి పోర్టల్ ద్వారా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. రెవెన్యూ, అటవీశాఖ భూముల వివాదాలకు రెండు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేసి పరిష్కారం సూచిస్తారన్నారు. భూభారతి లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి రావడం రైతుల అదృష్టంగా భావించాలన్నారు.
భూ సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోతాయిపల్లిలో 260, బోనాల్‌లో 47 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. సదస్సులో తహసీల్దార్ సురేశ్, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్, ఎఫ్‌ఆర్‌వో ఓంకార్, మొబైల్‌పార్టీ ఎఫ్‌ఆర్‌వో చరణ్‌తేజ్, నారాగౌడ్, రాజు, లక్ష్మీనారాయణ, బా లయ్య, రామలింగం, అల్లూరి, గంగారాం, ఆయా గ్రామాల రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్యలు..
దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను పోతాయిపల్లి రెవెన్యూ పరిధిలోని కోమట్‌పల్లి, కేశాయిపేట, అన్నారెడ్డిపల్లి, సురాయిపల్లితోపాటు తండాలకు చెందిన రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
రెవెన్యూ, అటవీశాఖ మధ్య వివాదం కారణంగా 62 సర్వే నంబరులోని 80 మంది రైతులకు సంబంధించి 183 ఎకరాల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
830 సర్వే నంబరులోని 400కుపైగా ఎకరాల భూమి పట్టాలను 200 మంది రైతులకు ఇవ్వగా, అందులో ప్రభుత్వ భూమి అని నమోదైంది.
543 సర్వే నంబరులో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి అని చూయిస్తోంది.
367 సర్వే నంబరులోని 300 ఎకరాల్లో పోతాయిపల్లి రైతులు దశాబ్దాలుగా కాస్తులో ఉన్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగా నమోదైంది.
పోతాయిపల్లి, బోనాల్ రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో పలువురు రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లు తప్పుగా పడడం, సాదాబైనామాలు, కోర్టు కేసులకు సంబంధించినవి, ఒకరి సర్వే నంబరు మరొకరికి రావడం, సాగులో ఉన్న భూమి ఆన్‌లైన్‌లో పూర్తిగా నమోదు కాకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి.
భూ భారతిలో మూడంచెల వ్యవస్థ


