
కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్‌ఎస్ సభకు అనుకున్నదానికన్నా ఎక్కువ మంది తరలివచ్చారని, సభ సక్సెస్ అయ్యిందని మీడియా మొత్తం చెబుతుండగా కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 40 వేల మందికిపైగా సభకు హాజరయ్యారని తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సభ సక్సెస్ కావడాన్ని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డగోలుగా వాగుతున్నారని విమర్శించారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్‌పై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత సభకు వచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభ విజయవంతం కాకుండా కుట్రలు చేసినప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చారని, కాంగ్రెస్ కుట్ర కారణంగా సభకు చేరుకోలేకపోయిన వారు రోడ్లపైనే కిలోమీటర్ల కొద్దీ వేచి ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజల నుంచి తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తాయని స్పష్టం చేశారు.
రజతోత్సవ సభను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే
వేముల ప్రశాంత్‌రెడ్డి