
మురుగుతున్న సోయా
ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి
పంట అంతాపోయినట్లే
● పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు
● ఆందోళనలో రైతాంగం
● ప్రభుత్వం ఆదుకోవాలని మొర
కామారెడ్డి క్రైం : పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండడంతో సోయా రైతులు నిండామునిగే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులు మినహా గత నెలరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సోయా తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షాల కారణంగా సోయా మురిగిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి చేతికొచ్చే పరిస్ధితులు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా దెబ్బతిన్న పంట..
నెల రోజులుగా కురుస్తున్న వానలకు సోయాబీన్ దాదాపు పోయినట్లేనని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకా పంట కోతలు ప్రారంభం కాకపోగా ఆకు రాలిపోయింది. అధిక వర్షాల కారణంగా కర్ర పలుచబడి కిందపడిపోగా, సోయా గింజలు బూజు పట్టి నల్లగా మారి చెడిపోతున్నాయి. సాధారణంగా ఎకరానికి కనీసం 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు నుంచి 3 క్వింటాళ్లు కూడా రావడం కష్టంగా ఉంది. మరికొన్ని రోజులపాటు వర్షాలు ఇలాగే కురిస్తే ఆ కొంత దిగుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు. నెల క్రితం కురిసిన వర్షాలకే పంట నీట మునిగి చాలా మట్టకు దెబ్బతిన్నది. ఇప్పుడు కోత దశలో కూడా వానలు వదలకపోడంతో పంట పూర్తిగా చెడిపోయి రైతులకు కష్టాలు పెరిగాయి.
ఒక ఎకరం సోయా సాగు చేసేందుకు రైతులు రూ.25వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తనం బస్తాకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు, దున్నడం, ఎరువులు, గడ్డిమందులు, కలుపు తీతలు, పురుగుమందులు, కోతలకు ఖర్చులు, ఇలా దాదాపు రూ.25 వేల వరకు ఎకరానికి పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే పెట్టిన పెట్టుబడులు తిరిగి రైతుల చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
నేను ఏడు ఎకరాల్లో సోయా సాగు చేశా. పంట దాదాపు పోయినట్లే. ఇప్పటికే లక్షన్న రకు పైగా పెట్టుబడి అయింది. రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వానలకు ఏమైనా దిగుబడి వస్తుందో, రాదో కూ డా తెలియడం లేదు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – జి.సంతోష్, రైతు, గాంధారి

మురుగుతున్న సోయా