
మాట్లాడుతున్న సురేశ్
కరీంనగర్: దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని దళితులందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రకారం ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు పథకాన్ని నియోజకవర్గానికి 1500 మందికి ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి సొంతింటి నిర్మాణం కోసం రూ.5 లక్షలివ్వాలన్నారు. 2021–22కు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లూరి కిశోర్, కోలాపురి ప్రభాకర్, నగర కార్యదర్శి గాజుల కనకరాజు, అధ్యక్షుడు పులిపాక సాయికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి కనకేశ్ తదితరులు పాల్గొన్నారు.