40 రూపాయలకు మూడు కేజీలు, నాణ్యమైన టమాటా.. అని వారం కిందటి వరకు ఆటోలు, బండ్లలో వ్యాపారులు మైక్ పెట్టి అమ్మేవారు. సాయంత్రానికి అమ్ముడుపోని సరుకును చెత్తదిబ్బలో పడేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. బజారులో చిల్లర ధర రూ. 60ని తాకుతోంది. ఇక కోలారు మార్కెట్లో రైతులు కష్టానికి ప్రతిఫలం దక్కుతోందని ఆనందం వ్యక్తంచేశారు.
కర్ణాటక: టమాటా రాజధానిగా ప్రఖ్యాతి గాంచిన కోలారు జిల్లాలో రెడ్ యాపిల్‌గా పిలువబడే టమాట ధరలు గగనానికి చేరుకున్నాయి. ధరల పెరుగుదలతో ఆ రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తే, కొనుగోలుదారులు బిక్కమొహం వేస్తున్నారు. కోలారు ఏపీఎంసీ మార్కెట్ యార్డులో శనివారం రోజున 15 కిలోల బాక్సు ధర రూ. 1,100 కి చేరుకుంది. ఈ రేంజిలో ధరల పెరుగుదలతో టమాట రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది.
15 కేజీల బాక్సు ధర ఇలా
మార్కెట్‌లో నాటురకం టమాట ధర 15 కిలోల బాక్సు నాణ్యతను బట్టి 400 రూపాయల నుంచి 800 మధ్య విక్రయం కాగా, ఫారం టమాట ధరలు కిలో 1,100 రూపాయలకు వరకు అమ్ముడయ్యాయి. చిల్లరగా టమాట ధర కేజీ రూ. 60 నుంచి 80 కి పుంజుకోవడంతో వినియోగదారులు అమ్మో అంటున్నారు. శనివారం కోలారు ఏపీఎంసీ మార్కెట్ నుంచి 40 లోడ్‌ల టమాట లోడ్‌లు వివిధ రాష్ట్రాలకు సరఫరా అయింది. రాష్ట్రంలోకి 2 లారీ లోడ్‌లు, తమిళనాడుకు 8 లోడ్‌లు, బిహార్‌కు 1 లోడ్, మహారాష్ట్రకు 2 లోడ్‌లు, రాజస్థాన్‌కు 2 లోడ్‌లు, ఉత్తరప్రదేశ్‌కు 4 లోడ్‌లు, గుజరాత్‌కు 7 లోడ్‌లు, కేరళకు 2 లోడ్‌లు, ఒడిశాకు 5 లోడ్‌లు, జార్ఖండ్‌కు 1 లోడ్, పశ్చిమ బెంగాల్‌కు 3 లోడ్‌ల సరుకు వెళ్లింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశంలోని ప్రతి మార్కెట్‌కు ఇక్కడి నుంచే టమోటా సరఫరా అవుతోంది.
ఇవేనా కారణాలు?
మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను రైతులు నాశనం చేయడం, బక్రీద్ సందర్భంగా బంగ్లా అంతర్జాతీయ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు బంద్ అయ్యే కారణం వల్ల ఒక్కసారిగా టమోటా ధరలు భగ్గుమన్నాయి.
ఈ పంటకు జిల్లా ప్రసిద్ధి
కోలారు జిల్లాలో మట్టి, వాతావరణం టమాట పంట పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇతర ప్రాంతాలలో టమాటాను సీజన్‌లోనే పండిస్తే కోలారు జిల్లాలో ఏడాది పొడవునా పండిస్తారు. కన్నడనాట సుమారు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంటే, కోలారు జిల్లాలో 12,750 హెక్టార్లలో పండిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల టన్నులు, ఒక్క కోలారులో 5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది.
చాలా సంతోషంగా ఉంది
కోలారు ఏపీఎంసీ మార్కెట్‌కు 93 బాక్సుల టమాట తెచ్చాను, 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయించాను. నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుంది. సోమవారం మరో 200 బాక్సులు మార్కెట్‌కు తెస్తాను. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం సంతోషాన్నిస్తోంది.
– మహేంద్ర, రైతు
Comments
Please login to add a commentAdd a comment