Belagavi : ఈ జైనమునిని ఎందుకింత కర్కశంగా హత్య చేశారు? | What was the reason behind the killing of Jain muni | Sakshi
Sakshi News home page

Belagavi : ఈ జైనమునిని ఎందుకింత కర్కశంగా హత్య చేశారు?

Published Mon, Jul 10 2023 1:14 AM | Last Updated on Mon, Jul 10 2023 9:04 PM

What was the reason behind the killing of Jain muni - Sakshi

అంత్యక్రియల తరువాత బెళగావి సువర్ణసౌధ వద్ద జైనుల ఆందోళన

యశవంతపుర: దారుణ హత్యకు గురైన బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా హిరేకోడి ఆశ్రమం జైనముని కామకుమార్‌ నంది మహరాజ అంత్యక్రియలు జైన సంప్రదాయం ప్రకారం జరిగాయి. ఆశ్రమంలో ఉదయం 10 గంటలకు జైన విధి విధానాలతో చితి పేర్చి దహనం చేశారు. ప్రముఖ జైన మునులు, వేలాదిగా ఆ వర్గంవారు తరలివచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ భవనం సువర్ణసౌధ వద్ద ధర్నా చేసి హంతకులను శిక్షించాలని నినాదాలు చేశారు.

ఏం జరిగిందంటే...

కామకుమార నంది మహరాజకు కర్ణాటక, మహారాష్ట్రలో అధిక సంఖ్యలో భక్తులున్నారు. ఈ నెల 5న స్వామి అదృశ్యంకాగా, 7న పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్నారు. రాయబాగ తాలూకా ఖగకబావి వద్ద పాడుబడిన బావిలో 8న స్వామి మృతదేహం కనిపించింది. హత్య కేసులో ప్రధాన నిందితులు నారాయణ మాళి (35), హసేన్‌ (34)లను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ సంజీవ పాటిల్‌ తెలిపారు.

హత్య చేసి బైక్‌పై తరలింపు

స్వామితో నారాయణ మాళికి మంచి పరిచయం ఉంది. స్వామిని నుంచి మాళి రూ. ఆరు లక్షలు డబ్బులు తీసుకున్నాడు, ఆయన తిరిగి ఇవ్వాలని అడగడంతో మాళి ఆగ్రహించి హత్యకు కుట్ర పన్నాడు. ఈ నెల 5వ తేదీన ఆశ్రమంలో స్వామిని కలిసి హసేన్‌తో కలిసి స్వామిని కరెంట్‌ షాక్‌తో హింసించి హత్య చేశారని ఎస్పీ తెలిపారు. హత్య తరువాత దుండగులు బైక్‌పై మృతదేహాన్ని హిరేకోడి నుంచి ఖటకబావి వరకు 39 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ముక్కలుగా నరికి బావిలో వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరి మీద అనుమానంతో గట్టిగా ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నారు.


జైనముని అంత్యక్రియలు 

సీబీఐకి అప్పగించాలి: ఎమ్మెల్యే

స్వామీజీ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బెళగావి దక్షిణ ఎమ్మెల్యే అభయపాటిల్‌ డిమాండ్‌ చేశారు. బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని పోలీసులు ప్రకటించారని తెలిపారు. అయితే ఇది నమ్మశక్యంగా లేదని, కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ చేయించాలని, కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక ఒక మతంపై దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.  ఇది జైన సముదాయానికి చెడ్డపేరు తేవడానికి జరుగుతున్నట్లు ప్రయత్నంగా కనిపిస్తోందని ఆరోపించారు. అయితే విపక్షాల విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. సిబిఐతో దర్యాప్తు అవసరం లేదని, కర్ణాటక పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement