కర్ణాటక: మాసిపోయిన తెల్లగడ్డం, చిరిగిపోయిన బట్టలు, పాత చెప్పులు, భుజంపై పెద్ద మూటతో ఒక వృద్ధుడు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడు గంజాయిని అమ్ముతున్నాడేమోనని ఓ వ్యక్తి అనుమానంతో డయల్ 112 నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ కాల్ ఒక కుటుంబాన్ని కలిపింది. ఫోన్ చేసిన వ్యక్తి చొరవ, పోలీసుల కృషి దీని వెనుక ఉన్నాయి. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని ఆపి అతడి భుజంపై మోస్తున్న పెద్ద మూటను పరిశీలించగా డబ్బులు కనిపించాయి. అందులో రూ. 50 వేల చిల్లర, నోట్లు ఉన్నాయి. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా చెన్నరాయనదుర్గ హోబళి సిద్దరబెట్ట గ్రామ పంచాయతీ పరిధిలో మరేనాయకనహళ్లి గ్రామంలో జరిగింది.
పదేళ్ల కిందట ఇల్లు వదిలి..
కొంతకాలంగా మరేనాయకనహళ్లి బస్టాండ్‌వద్ద గురుసిద్ధప్ప అనే వ్యక్తి చిరిగిపోయిన దుస్తులు ధరించి మూటతో ఉంటున్నాడు. అతన్ని పోలీసులు విచారించగా తన కథ చెప్పాడు. గుబ్బి తాలూకా చేళూరు హోబళి ఎంహెచ్ పట్న గ్రామ పంచాయతీ పరిధిలోని మాదాపుర గ్రామానికి చెందిన గురుసిద్ధప్ప తన భార్యతో గొడవల కారణంగా పదేళ్ల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చి జీవిస్తున్నట్లు చెప్పాడు. తుమకూరు, గుబ్బి, దేవరాయనదుర్గ, మధుగిరి, పావగడ, కొరటగెరె, సిద్దరబెట్ట తదితర ప్రాంతాల్లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బును గోనెసంచిలో భద్రం చేసుకున్నాడు.
కుటుంబాన్ని పిలిపించి..
ఏఎస్సై హనుమంతరాయప్ప, హెడ్‌కానిస్టేబుల్ రామకృష్ణయ్య, కొరటెగెరె పీఎస్సై చేతన్‌లు అతని భార్యకు సమాచారం ఇచ్చారు. వెంటనే భార్య మంగళమ్మ, కుమారుడు ప్రవీణ్ వచ్చారు. గురుసిద్ధప్పను, అలాగే నగదును అందించి మానవత్వం చాటుకున్నారు.
పోలీసులకు కృతజ్ఞతలు
‘చిన్న విషయానికే నన్ను వదిలేసి నా భర్త వెళ్లిపోయాడు. పదేళ్లు అయిపోయింది. కొరటగెరె పోలీసుల సహాయంతో మళ్లీ మాకు దొరికాడు. నా భర్త దాచిన డబ్బులు తిరిగి మాకే పోలీసులు ఇచ్చారు. నా భర్తను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు.’
– మంగళమ్మ
Comments
Please login to add a commentAdd a comment