కర్ణాటక: కులాచారం ప్రకారం బాలింత శిశువుతో కలిసి ఊరిబయట కొబ్బరి మట్టల గుడిసెలో ఉండడం, గాలివానకు శిశువు అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చనిపోయిన సంఘటనపై జిల్లా సివిల్ న్యాయమూర్తి, న్యాయసేవల ప్రాధికార కార్యదర్శి నూరున్నీసా స్పందించారు. శిశువు మృతిపై గురువారం సాక్షి పత్రికలో ‘‘ఆరుబయట.. గాలీవానలో తల్లీబిడ్డ’’ శీర్షిక పేరిట వార్తాకథనం ప్రచురితం కావడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె జిల్లాలోని బెళ్లావి దగ్గరున్న మల్లేనహళ్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జడ్జితో పాటు పలు శాఖల అధికారులు వచ్చారు. బాలింత వసంతను వెంటనే గుడిసె నుంచి ఇంటికి తరలించారు. బిడ్డలు చనిపోయిన బాలింతను గ్రామంలోకి తీసురాకూడదని గ్రామస్తులు అభ్యంతరం చెప్పగా వారిమీద జడ్జి మండిపడ్డారు.
ఊరిబయట ఎలా ఉంచుతారు?
ఒంటరిగా బాలింతను చంటిబిడ్డను ఊరి బయట ఉంచుతారా? అని గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసంత, ఆమె కుటుంబసభ్యులతో జడ్జి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మూడురోజులుగా గుడిసెలో ఎలా ఉంచారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
కవలలు పుట్టినా పురిట్లోనే ఒకరు, గుడిసెలో మరొకరు చనిపోయారని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాలింతకు వైద్య పరీక్షలు చేయించి బలహీనంగా ఉండడంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment