కర్ణాటక: ఇటీవల రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే జీవితం సాగడం లేదు. ప్రతి పనికీ మొబైల్ కావాలి. దీని వల్ల ఎంత మంచి జరిగినా, కీడు కూడా తప్పడం లేదు. మొబైల్‌ఫోన్ వంటి డిజిటల్ పరికరాలపై ఆధారపడిన ఐటీ సిటీ పౌరులు బంగారం లాంటి నిద్రను పాడు చేసుకుంటున్నారు. 59 శాతం మంది పౌరులు అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం సాధ్యం కావడం లేదు. దీనివల్ల నిద్ర కరువై అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. 46 శాతం మంది నిద్రలేచిన తరువాత కూడా తగినంత నిద్ర లేనందున నిరాసక్తంగా ఉంటున్నారని ఒక సర్వే వెల్లడించింది.
90 శాతం మంది అదే మాట
► వేక్ పిట్‌కో అనే సంస్థ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్టోర్ కార్డ్స్– 2024 అనే సర్వేను విడుదల చేసింది. ఇందులో బెంగళూరు నిద్ర ప్రవృత్తి, ప్రజల మొబైల్ అలవాట్ల గురించి ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది.
► సమీక్షలో పాల్గొన్న 90 శాతం మంది.. నిద్రపోయే వరకూ మొబైల్‌ఫోన్‌ను వాడుతున్నామని తెలిపారు.
► 38 శాతం మంది రాత్రి 11 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు.
► కుతూహలమైది ఏమిటంటే 29 శాతం మంది ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు మేలుకునే ఉంటారు. నిద్రను నిర్లక్ష్యం చేసేవారు పగలు ఉత్సాహం కోల్పోయి తమ పనులను సమర్థంగా చేయలేకపోతున్నారని సర్వే హెచ్చరించింది.
మంచి నిద్రకు ఇది ముఖ్యం
బాగా నిద్రపోవాలంటే పడుకునే గంట ముందు వరకు మొబైల్, కంప్యూటర్ తరహా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. కానీ 59 శాతం మంది నిద్రపోయే చివరి క్షణం వరకూ మొబైల్‌తో గడుపుతున్నారు. దీని వల్ల నిద్ర సక్రమంగా సాగదు. ఉదయాన్నే హుషారు లేకపోగా నిస్సత్తువ ఆవరిస్తుంది.
దూరంగా ఉంటేనే మంచిది
28 శాతం మంది తమ పనుల వల్ల అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటామని తెలిపారు. 55 శాతం మంది డ్యూటీలో ఉన్నప్పుడు నిద్ర వస్తుందని, ఒళ్లునొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. 40 శాతం మంది రాత్రి మొబైల్, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉంటే మంచి నిద్ర సాధ్యమని నమ్ముతున్నారు. 23 శాతం మంది ప్రజలు మంచి బెడ్, గదిలో అలంకారం వల్ల బాగా నిద్రించవచ్చని చెప్పారు. ఏదేమైనా సిలికాన్ నగరవాసులు మొబైల్ మోజులో పడి నిద్రను అశ్రద్ధ చేస్తున్నారని వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment