సిట్ విచారణకు భవాని హాజరు
అక్కడే ఉన్న తనయుడు ప్రజ్వల్
హాసన్ నివాసాల్లో ప్రజ్వల్ మహజరు
బనశంకరి: అత్యాచార బాధిత మహిళను అపహరించిన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ శనివారం సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హాసన్ జిల్లా కేఆర్ నగరలో బాధిత మహిళ అపహరణ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో సిట్ ఆఫీసులో భవాని హాజరయ్యారు. సిట్ అధికారులు భవానీని విచారించారు. హైకోర్టు వారంరోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సీఐడీ సముదాయంలో ఉన్న సిట్ ఆఫీసుకు భవాని లాయరుతో కలిసి వచ్చారు. తాను ఏ మహిళ ను అపహరించలేదని, తనపై కుట్ర చేశారని ఆమె చెప్పారు. సుమారు 4 గంటలపాటు విచారణ చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదని సమాచారం. బాధిత మహిళ తమ ఇంట్లో పనిచేస్తుందని, నేను ఆమెను అపహరించలేదని భవాని పదేపదే చెప్పారు. షరతుల ప్రకారం భవాని రోజూ మధ్యాహ్నం 1 గంట కు సిట్ విచారణకు హాజరు కావాలి. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపవచ్చు. ఆపై ఆమెను పంపించి వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులోనే భర్త రేవణ్ణ అరెస్టయి విడుదలయ్యారు.
సిట్ ఆఫీసులో తల్లీ తనయుడు
భవాని సిట్ ఆఫీసులో విచారణకు హాజరైనప్పడు అక్కడే పక్కగదిలో విచారణలో కుమారుడు ప్రజ్వల్ ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్ 27 నుంచి ప్రజ్వల్‌తో తల్లి భవాని ముఖాముఖి మాట్లాడింది లేదు. ప్రజ్వల్, భవానీని వేర్వేరుగా విచారించారు.
హైకోర్టులో రేవణ్ణ అర్జీ
హాసన్ జిల్లా హొళేనరసిపుర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన లైంగిక దాడికేసు రద్దుచేయాలని జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ.రేవణ్ణ హైకోర్టులో వేసిన పిటిషన్ పై సిట్ కు హైకోర్టు నోటీస్ జారీచేసింది. జడ్జి జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను ఆలకించింది. సిట్ వాదన తెలియజేయాలని ఆదేశిస్తూ 21 తేదీకి వాయిదా వేసింది.
ప్రజ్వల్ స్నేహితునికి నోటీసులు
ప్రజ్వల్‌కు విదేశాల్లో సాయం చేసిన అతని స్నేహితున్ని విచారణకు హాజరుకావాలని సిట్ నోటీస్ జారీచేసింది. 34 రోజుల పాటు ఎవరికీ అందుబాటులోకి రాకుండా ప్రజ్వల్ జర్మనీలో మకాం వేశాడు. ఇందుకు అతని స్నేహితుడు సాయం చేసినట్లు సిట్ గుర్తించింది. దీంతో విచారణకు రావాలని నోటీసులు పంపింది.
కార్తీక్ గౌడ అరెస్టు
హాసన్‌లో నగ్నచిత్రాల పెన్‌డ్రైవ్‌లను లీక్ చేసిన కేసులో సిట్ అధికారులు శనివారం కార్తీక్‌గౌడ అనే వ్యక్తిని అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని నిర్బంధించారు.
హాసన్‌లో నివాసాలలో తనిఖీ
యశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్‌కు చెందిన హాసన్ జిల్లా హొళెనరసిపురలోని నివాసంలో సిట్ అధికారులు మహజరు చేశారు. చెన్నాంబిక అనే పేరు గల ఈ ఇంటికి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. ముందుజాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనంలో బయటకు కనబడకుండా బెంగళూరు నుంచి ప్రజ్వల్‌ను తీసుకెళ్లారు. మొదట ఆ నివాసంలో విచారణ జరిపి, మళ్లీ హాసన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment