
పరప్పన జైలులో సాధారణ భోజనం
తుమకూరుకు మార్చాలంటున్న పోలీసులు
శివాజీనగర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రగౌడ, హీరో దర్శన్, మరో 15 మంది నిందితులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చేరారు. దర్శన్ సాధారణ ఖైదీలా మారిపోయారు. అయితే ఇతర ఖైదీల నుండి ప్రమాదం రాకుండా ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. శనివారం రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు.
దర్శన్ రిమాండు ఖైదీ నంబరు 6106, ధనరాజ్ 6107, వినయ్ 6108, ప్రదోశ్ 6109 నంబర్ ఇచ్చారు. భద్రత కోసం దర్శన్‌ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి 13 రోజులు కాగా, ఆయన బరువులో కొంతవరకు తగ్గి రక్తపోటులో తారతమ్యంగా ఉన్నట్లు తెలిసింది. ఎప్పుడూ సినిమాలలో మాత్రమే కనిపించే దర్శన్ తమ ముందే ఉండడంతో సిబ్బంది, ఖైదీలు సంభ్రమానికి గురయ్యారు.
పవిత్ర రగడ రగడ
జైల్లో పవిత్రాగౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు జైలు దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని రగడ చేసినట్లు తెలిసింది. అది కావాలి, ఇది కావాలని చిన్న చిన్న విషయాలకు అలుగుతున్నట్లు తెలిసింది. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించగా, ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారు.
రిమాండు రిపోర్టులో ఏముంది ?
చిత్రదుర్గ రేణుకాస్వామి ఘోర హత్య కేసులో పరప్పన అగ్రహార జైలో చేరిన నటుడు దర్శన్‌తో పాటుగా 17 మంది నిందితులు, హత్యను తప్పుదారి పట్టించేందుకు సాక్షులను బెదిరింపులకు గురిచేశారని పోలీసులు చెబుతున్నారు. ఓ సాక్షిని నిందితులు ప్రాణ బెదిరింపులకు పాల్పడగా, రహస్యంగా కాపాడినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ పిటిషన్‌లో తెలిపారు. కేసులో తమ పేరు రాకూడదని ఓ వ్యక్తికి దర్శన్ రూ. రూ.40 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సొమ్ము ఆచూకీ కనిపెట్టేందుకు రెండురోజుల పాటు మూడోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. దర్శన్ మొబైల్‌ఫోన్‌ను తనిఖీ చేసేటప్పుడు డేటా పోయింది, కోర్టు అనుమతితో మళ్లీ సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసులో 9వ నిందితుడు ధనరాజ్ ఎలెక్ట్రికల్ టార్చ్ షాక్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి సొమ్ము జమ చేయగా, దీని ఆధారాలను అందుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment