యాదగిరి జిల్లా కొండమ్మవ్వ
ఆలయంలో వింత ఆచారం
నాగపంచమి రోజున తేళ్లతో భక్తుల సయ్యాట
రాయచూరు రూరల్: రాష్ట్రమంతటా శుక్రవారం నాగపంచమిని జరుపుకొంటే, జిల్లా సరిహద్దులోని ఓ గ్రామ ప్రజలు విభిన్నంగా తేళ్ల పంచమిని ఆచరించారు. యాదగిరి జిల్లా గుర్మిట్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ అమ్మవారి సన్నిధిలో తేళ్ల పంచమి పండుగ జరిగింది. గుట్టపై అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు, తరువాత ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తీసినా వాటి కింద తేళ్లు కనిపించాయి. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా తేళ్లను పట్టుకొన్నారు. అవి కాటేస్తాయన్న భయం ఏ కోశాన కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.
కుట్టకపోవడం వింత
కొందరు తల, చెవులు, మెడ, నాలుకపై తేళ్లను ఆడించి ఆనందపడ్డారు. ఈరోజున తేళ్లను పట్టుకున్నా శరీరంపై పాకించినా అవి కుట్టనే కుట్టవు. అమ్మవారి మహిమ ఇందుకు కారణమని భక్తుల విశ్వాసం. శ్రావణంలో తేలు పూజల వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న నమ్మకంతో వందలాది భక్తులు తరలిస్తారు. పాలు, నువ్వులు, బెల్లం తదితర పదార్థాల వంటకాలను గుట్టపై ఉంచి పూజలు చేస్తారు. కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment