Naga panchami
-
తేలుతో ఆటాడుకుంటాం
రాయచూరు రూరల్: రాష్ట్రమంతటా శుక్రవారం నాగపంచమిని జరుపుకొంటే, జిల్లా సరిహద్దులోని ఓ గ్రామ ప్రజలు విభిన్నంగా తేళ్ల పంచమిని ఆచరించారు. యాదగిరి జిల్లా గుర్మిట్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ అమ్మవారి సన్నిధిలో తేళ్ల పంచమి పండుగ జరిగింది. గుట్టపై అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు, తరువాత ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తీసినా వాటి కింద తేళ్లు కనిపించాయి. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఉత్సాహంగా తేళ్లను పట్టుకొన్నారు. అవి కాటేస్తాయన్న భయం ఏ కోశాన కనిపించలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది.కుట్టకపోవడం వింతకొందరు తల, చెవులు, మెడ, నాలుకపై తేళ్లను ఆడించి ఆనందపడ్డారు. ఈరోజున తేళ్లను పట్టుకున్నా శరీరంపై పాకించినా అవి కుట్టనే కుట్టవు. అమ్మవారి మహిమ ఇందుకు కారణమని భక్తుల విశ్వాసం. శ్రావణంలో తేలు పూజల వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్న నమ్మకంతో వందలాది భక్తులు తరలిస్తారు. పాలు, నువ్వులు, బెల్లం తదితర పదార్థాల వంటకాలను గుట్టపై ఉంచి పూజలు చేస్తారు. కర్ణాటకతో పాటు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. -
నేడు నాగ పంచమి? లేక గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..
నిజానికి పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ్రేంద్రుడుని పూజించడం వంటివి చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం 'గరుడ పంచమి' అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గ్రద) రెండు పరమ వైరి జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా లేక గరుడు పంచమి అనాల? ఎందికిలా రెండు రకాలుగా పిలుస్తున్నాం. దీనికున్న ప్రాశస్యం తదితరాల గురించే ఈ కథనం!. ఎందుకిలా రెండు రకాలుగ పిలుస్తున్నారంటే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచిమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎందుకింత మహిమాన్వితమైంది అంటే.. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా , వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు , గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని , గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం , తల్లి ఋణం తీర్చుకోవాలని , ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని , పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా , జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారని జయించడం కష్టం. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా, తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి.. ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.. అనుసరించాలి. నిర్మలమైన మనస్సు , తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి , బియ్యంపోసి , వారి శక్తి మేర బంగారు , వెండి నాగపడిగను ప్రతిష్టించి , పూజచేసి , పాయసం నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా, సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచిమి లేదా గరుడ పంచిమి రోజున ఆ ఇరువురిని కొలచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి. (చదవండి: శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..) -
‘నాగినిలకు నాగ పంచమి శుభాకాంక్షలు’
న్యూఢిల్లీ: ఇవాళ నాగ పంచమి సందర్భంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన 'నాగిని'లకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక రాబోయే ‘నాగిని’ సీజన్-5 ప్రోమోను ఈ సందర్భంగా ఏక్తా ఆవిష్కరించారు. కానీ ఈ సిజన్లో కనిపించే కొత్త నాగిని ఎవరనేది మాత్రం తెలియకుండా కొత్త పోస్టర్‌ను షేర్ చేసి అభిమానులను అయోమయంలో పెట్టారు. ఏక్తా ఈ పోస్టులో ‘నా నాగినీలకు.. హ్యాపీ నాగ పంచమి’ అంటూ గత సీజన్‌ల్లోని నాగినిలు మోనీ రాయ్, అనిత, కరిష్మా, సురభీ జ్యోతీ, నియా శర్మ తదితరులను ట్యాగ్ చేశారు. (చదవండి: నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం) అయితే ఈ సీజన్లో హినా ఖాన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ తను లీడ్రోల్లో నటిస్తుందా లేదా సపోర్టింగ్ క్యారెక్టర్లో నటించనుందా అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ‘నాగినీ-5’లో నటించే ప్రధాన పాత్రల పేర్లను నిర్మాత గోప్యంగా ఉంచారు. 'కుండలి భాగ్య' ఫేమ్ ధీరజ్ ధూపర్ మేల్ లీడ్రోల్లో ఈ సీజన్లో కనిపించనున్నాడు. తన కొత్త సీరియల్‌పై ధీరజ్ అనందం వ్యక్తం చేస్తూ... ‘‘ఇది నాకు చాలా ఉత్తేజకరమైన సమయం. టెలివిజన్‌లో అగ్రశ్రేణి షో అయిన ‘నాగినీ’ వంటి కార్యక్రమంలో నటించాలన్నది ప్రతి నటుడి కల. ఇది నాకు సరికొత్త అనుభవంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకు ముందెన్నడు ఇలాంటి పాత్రలు చేయలేదు. ఏక్తా కపూర్‌తో కలిసి పనిచేయడం, కలర్స్‌తో మళ్లీ సంబంధం కలిగి ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. View this post on Instagram HAPPY NAAG ‘PAANCHAMI’ ... to all my Naagins @imouniroy @anitahassanandani @adaakhann @karishmaktanna @surbhijyoti @imrashamidesai @niasharma90 A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 24, 2020 at 11:57pm PDT -
సర్పదోష నివారణకు నాగ పంచమి
శ్రావణ శుద్ధ పంచమిని ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ జరుపుకుంటారు. మనం పూజించే నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా జరుపుకునే పర్వమే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. ఎలా జరుపుకోవాలంటే... నాగపంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేయాలి. ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, గంధ, పుష్ప, అక్షతలతో పూజించి, దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరించాలి. పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పించాలి. నాగపంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. కాలసర్ప దోష నివారణ కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి. గరుడ పంచమి నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. – డి.వి.ఆర్. -
పాములకు పాలు పట్టించడం జంతుహింసే!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 5న నాగపంచమి నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాములు పాలు తాగుతాయనే ప్రచారం చేస్తే, అలాంటి వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అధికారులు అరణ్యభవన్‌లో సమావేశమయ్యారు. నాగపంచమిరోజు దేవాలయాల దగ్గరకు ఎవరైనా పాములతో వస్తే వెంటనే అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. పాములను పట్టుకుని ఆడించటం, పాలు పట్టడం వంటివి వన్యప్రాణి చట్టాల ప్రకారం జంతుహింస కిందకు వస్తాయని తెలిపారు. పాములను పట్టుకుని హింసించే వారి వివరాలు అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364 కు తెలపాలని అధికారులు కోరారు. ఈ నెల 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో పులుల సంరక్షణ మీద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, పీసీసీఎఫ్ ఆర్.శోభ అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్‌వో పూజారి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శంకరన్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అవినాష్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నుంచి ఫరిదా తంపాల్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో నాగపంచమి
అనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో నాగ పంచమిని ఆదివారం జరుపుకున్నారు. శ్రావణమాసంలో వచ్చిన తొలిపండుగ కావడంతో ఉదయం నుంచే పలు ఆలయాల్లోనూ, నాగుల పుట్టల వద్ద మహిళలు బారులుదీరి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగర సమీపంలోని చెరువుకట్టపై వెలసిన నాగేంద్రుడికి, నగర శివారులోని శివకోటిలో నాగపంచమి వేడుకలు నిర్వహించారు. అలాగే హెచ్చెల్సీ కాలనీలోని వల్లి,దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడికి మఠం బసవరాజ స్వామి ఆధ్వర్యంలో గరుడ పంచమి వేడుకలు నియమనిష్టలతో జరిగాయి. -
నాగమ్మా... కరుణించవమ్మా!
శ్రీశైలం(కర్నూలు): నాగులచవితిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంభమల్లికార్జున ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద మంగళవారం ఘనంగా నాగులచవితి వేడుకలను నిర్వహించారు. నాగులకట్ట వద్ద ఉన్న పుట్టకు పూజలు చేసి నాగమ్మా...కరుణించవమ్మా అంటూ వేడుకుంటూ అక్కడి నాగప్రతిమలకు పాలతో అభిషేకాలను చేశారు. ఉపవాసదీక్షను తీసుకుని పుట్టలో పాలు పోసి పత్తితో చేసిన వస్త్రంలాంటి యజ్ఞోపవీతాన్ని నాగ ప్రతిమలకు అలంకరించి ప్రత్యేకపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదనగా సమర్పించారు. నాగులచవితిన ఆలయప్రాంగణంలోని పుట్టలకు, నాగప్రతిమలకు పూజలు చేయడం ఆనవాయితీ. చవితి తరువాత మరుసటి రోజు వచ్చే నాగపంచమికి కూడా విశిష్టత ఉందని వేదపండితులు తెలిపారు. నాగపంచమి రోజున ఇంట్లోనే బంగారు, వెండి లేదా మట్టితో చేసిన నాగప్రతిమకు పంచామృతాలతో, జాజి,సంపెంగలాంటి సువాసన పూలతో పూజించడం వలన సర్పదోషాలు నశిస్తాయని, గర్భదోషాలు నివారించబడుతాయని, కళ్లకు చెవులకు సంబంధించిన వ్యాధులు రావని పేర్కొన్నారు. నేడు శ్రావణశుద్ధ నాగపంచమి జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో బుధవారం శ్రావణశుద్ధ నాగపంచమి సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని నాగులకట్ట నాగపంచమి వేడుకలను నిర్వహించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగపంచమిని ఎలా చేయాలి పురాణవచనాన్ని బట్టి శ్రావణశుద్ధ పంచమినాడు ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవుపేడతో సర్పాలను వేసి విధి విధానంగా లేత గరిక, దర్భ, గంధ పుష్పాక్షతలు, పెరుగు, మొదలైన వాటితో నాగేంద్రుని అర్చించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయాలని వేదపండితులు తెలిపారు. ఇలా చేసిన వారికి సర్పభయం ఉండదని, సంతానం లేనివారికి పుత్రపౌత్రాభిరస్తు అని నాగేంద్రుడు దీవిస్తాడని వారు పేర్కొన్నారు. -
ఘనంగా నాగులపంచమి వేడుకలు