
నాగమ్మా... కరుణించవమ్మా!
శ్రీశైలం(కర్నూలు): నాగులచవితిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంభమల్లికార్జున ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద మంగళవారం ఘనంగా నాగులచవితి వేడుకలను నిర్వహించారు. నాగులకట్ట వద్ద ఉన్న పుట్టకు పూజలు చేసి నాగమ్మా...కరుణించవమ్మా అంటూ వేడుకుంటూ అక్కడి నాగప్రతిమలకు పాలతో అభిషేకాలను చేశారు. ఉపవాసదీక్షను తీసుకుని పుట్టలో పాలు పోసి పత్తితో చేసిన వస్త్రంలాంటి యజ్ఞోపవీతాన్ని నాగ ప్రతిమలకు అలంకరించి ప్రత్యేకపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించుకున్నారు. అనంతరం నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదనగా సమర్పించారు.
నాగులచవితిన ఆలయప్రాంగణంలోని పుట్టలకు, నాగప్రతిమలకు పూజలు చేయడం ఆనవాయితీ. చవితి తరువాత మరుసటి రోజు వచ్చే నాగపంచమికి కూడా విశిష్టత ఉందని వేదపండితులు తెలిపారు. నాగపంచమి రోజున ఇంట్లోనే బంగారు, వెండి లేదా మట్టితో చేసిన నాగప్రతిమకు పంచామృతాలతో, జాజి,సంపెంగలాంటి సువాసన పూలతో పూజించడం వలన సర్పదోషాలు నశిస్తాయని, గర్భదోషాలు నివారించబడుతాయని, కళ్లకు చెవులకు సంబంధించిన వ్యాధులు రావని పేర్కొన్నారు.
నేడు శ్రావణశుద్ధ నాగపంచమి
జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో బుధవారం శ్రావణశుద్ధ నాగపంచమి సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలోని నాగులకట్ట నాగపంచమి వేడుకలను నిర్వహించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
నాగపంచమిని ఎలా చేయాలి
పురాణవచనాన్ని బట్టి శ్రావణశుద్ధ పంచమినాడు ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవుపేడతో సర్పాలను వేసి విధి విధానంగా లేత గరిక, దర్భ, గంధ పుష్పాక్షతలు, పెరుగు, మొదలైన వాటితో నాగేంద్రుని అర్చించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయాలని వేదపండితులు తెలిపారు. ఇలా చేసిన వారికి సర్పభయం ఉండదని, సంతానం లేనివారికి పుత్రపౌత్రాభిరస్తు అని నాగేంద్రుడు దీవిస్తాడని వారు పేర్కొన్నారు.