నిధులు కేటాయించరూ.. | - | Sakshi
Sakshi News home page

నిధులు కేటాయించరూ..

Published Thu, Feb 20 2025 12:24 AM | Last Updated on Thu, Feb 20 2025 12:23 AM

నిధుల

నిధులు కేటాయించరూ..

రాయచూరు రూరల్‌: వ్యవసాయ కూలీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కర్ణాటక ప్రాంత రైతు కూలీ కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం దేవదుర్గ తాలూకా శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ వద్ద ఆందోళన చేపట్టిన జిల్లాధ్యక్షుడు లింగణ్ణ మాట్లాడారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాదిరిగా వ్యవసాయ కూలీ కార్మికులకు జీవిత భద్రత, ఇళ్ల నిర్మాణాలు, కూలీలకు పర్మినెంట్‌ పనులు, వ్యవసాయ భూమిని కేటాయించాలన్నారు. ఆహార భద్రత, ఉచిత ఆరోగ్యం, పెన్షన్‌, పిల్లలకు విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

24, 25 తేదీల్లో సదస్సు

హుబ్లీ: ధార్వాడలోని డిమ్హాండ్స్‌, స్టార్టప్‌ కర్ణాటక, కిడ్స్‌ సంస్థ, ఐటీ బీటీ విభాగాలు, విజ్ఞాన సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు ఏర్పాటు చేశారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలకు ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభ్యత ఉన్న పరిశోధన పథకాలకు ఉన్న ఆర్థిక లభ్యత తదితర అవసరాలు, మార్పులు చేర్పుల గురించి తెలియజేయడమే సదస్సు ప్రధాన ఉద్దేశం. బెంగళూరు కిడ్స్‌ మేనేజర్‌ అర్చన సదస్సును ప్రారంభిస్తారు. డిమ్హాండ్స్‌ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, ఐఐఐటీ ధార్వాడ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహాదేవ ప్రసన్న, డాక్టర్‌ రాఘవేంద్ర నాయక్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు, బోధన సిబ్బంది పాల్గొంటారు. పేర్ల నమోదు ఉచితం అని, మరిన్ని వివరాలకు 7069084098లకు సంప్రదించాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు.

నిందితుల అరెస్ట్‌కు వినతి

రాయచూరు రూరల్‌: అనుమానాస్పద రీతిలో ఇద్దరు ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి చెరువులో పడేసిన నిందితులను అరెస్ట్‌ చేయాలని బేడ జంగమ సమాజం డిమాండ్‌ చేసింది. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద బేడ జంగమ సమాజం అధ్యక్షుడు మహంతేష్‌ మాట్లాడారు. యాదగిరి జిల్లా గురుమఠకల్‌ తాలూకా సైదాపుర నీలహళ్లి చెరువులో అనుమానాస్పదంగా జరిగిన హత్యల్లో ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసి సీఐడీకి అప్పగించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

విద్యార్థులతో మురుగు తొలగింపు

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మురుగు కాలువలను శుభ్రం చేయించిన ఉదంతం వెలుగు చూసింది. యాదగరి జిల్లా వడగేర తాలూకా బి.కదంగేరలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శరణప్ప పాఠశాల విద్యార్థుల నుంచి పాఠశాల ముందున్న మురుగు కాలువల్లో అధికంగా పూడిక పేరుకుంది. మురుగునీరు ముందుకు ప్రవహించకుండా నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో విద్యార్థులు శ్రమదానంతో శుభ్రం చేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఆందోళన చేపట్టి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శరణప్పను సస్పెండ్‌ చేయాలని ఒత్తిడి చేశారు.

ఛత్రపతి శివాజీ జయంతి

రాయచూరు రూరల్‌: నగరంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఆచరించారు. బుధవారం అంబా భవాని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శివాజీ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పుష్పాంజలి ఘటించారు. మంత్రి మాట్లాడుతూ శివాజీ మహారాజ్‌ మార్గదర్శనంలో నడవాలన్నారు. సమాజాభివృద్ధికి విద్య ప్రధానమన్నారు. నగర శాసన సభ్యుడు శివరాజ్‌ పాటిల్‌, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, అమిత్‌ జగతాప్‌, రవీంద్ర, శివకుమార్‌, శాంతప్ప, రమేష్‌లున్నారు.

నకిలీల బెడద అరికట్టండి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో నకిలీ ప్రమాణ పత్రాల నియంత్రణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ కర్ణాటక వాల్మీకి నాయక్‌ సంఘం కలబుర్గి విభాగపు ప్రధాన కార్యదర్శి రఘువీర్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే కాకుండా ఇతర కులాల వారు కూడా ఎస్టీ జాబితాల నుంచి నకిలీ కుల ప్రమాణ పత్రాలను పొందుతున్నారన్నారు. దీనిపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి లోపదోషాలను సవరించాలని ఆయన ఒత్తిడి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిధులు కేటాయించరూ.. 
1
1/3

నిధులు కేటాయించరూ..

నిధులు కేటాయించరూ.. 
2
2/3

నిధులు కేటాయించరూ..

నిధులు కేటాయించరూ.. 
3
3/3

నిధులు కేటాయించరూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement