వేసవి రాకున్నా.. నీరు లేదన్నా
బనశంకరి: రాష్ట్రంలో ఎండాకాలం రావడానికి ముందే నీటి కొరత వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో ప్రజలు జలం కోసం ఇబ్బందులు పడుతున్నారు. బయలుసీమ తుమకూరు, చిత్రదుర్గ, కోలారు, చిక్కబళ్లాపుర జిల్లాలో పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తగా, ఉత్తరకర్ణాటక ప్రాంతంలోని విజయపుర, బాగల్‌కోటే, బెళగావి, కలబురిగి, యాదగిరి జిల్లాల్లో మంచినీటితో పాటు వాడుకోవడానికి బోరు నీరు కూడా కరువైంది.
భూగర్భ జలాలు అంతే
అనేక జలాశయాల్లో నీరు తగ్గిపోయింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటినట్లు సమాచారం. పల్లెల్లో బోర్లలో నీరు తగ్గిపోగా, కొన్ని చోట్లయితే ఎండిపోయాయి. జాతీయ జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్ కల్పించారు. కానీ జల వనరులే లేక ఆ కొళాయిల్లో నీళ్లు రావడం లేదు. ఉత్తర కర్ణాటకలో కొన్ని గ్రామాల్లో ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పశుపక్ష్యాదులు కూడా దాహంతో అల్లాడుతున్నాయి.
కార్యాచరణ శూన్యం
గత వేసవిలో 1700 కు పైగా గ్రామాల్లో తాగునీటి ఇబ్బంది రాగా, రాష్ట్ర ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసింది. కొన్ని చోట్ల బోర్లకు మరమ్మతులు, కొత్త బోర్లు వేసి అత్యవసర చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం తలెత్తడంతో చాలామంది మంత్రులు అందులో నిమగ్నమయ్యారు. గ్యారంటీ పథకాల కారణంగా నిధుల కొరత ఏర్పడి సర్కారు దానిపై దృష్టిపెట్టింది. నీటి ఎద్దడి నివారణకు జిల్లా యంత్రాగంలో నిధులు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా వేసవి ప్రారంభం కాకపోవడంతో వ్యక్తిగత అకౌంట్‌లో ఉన్న నిధులను కలెక్టర్లు వాడుకోలేరని చెబుతున్నారు. గత అనుభవాలను చూసైనా దాహం కేకలు తీవ్రతరం కాకుండా జాగ్రత్త వహించాలి. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో నీటి కొరత చర్చనీయాంశం కావచ్చు.
అప్పుడే పలు జిల్లాల్లో జల సంక్షోభం
వేసవి రాకున్నా.. నీరు లేదన్నా
Comments
Please login to add a commentAdd a comment