కుంభమేళాకు వెళ్తూ మహిళ దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నుంచి ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్తున్న ట్రావెలర్స్ టెంపో వాహనాన్ని లారీ ఢీకొనింది. టెంపోలో ప్రయాణిస్తున్న మహిళ చనిపోయింది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ కట్టా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కుటుంబం మంగళవారం ఉదయం టీటీలో కుంభమేళాకు బయలుదేరింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలో మధ్యప్రదేశ్‌లోని కట్టా అనే చోట లారీ ఢీకొంది. టెంపో పల్టీలు కొట్టింది, ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బెంగళూరుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
పని ఒత్తిడి, నిద్రలేమి..
టెక్కీ ఆత్మహత్య
హోసూరు: ప్రైవేట్ కంపెనీలో పనిచేసే టెక్కీ.. ఒత్తిడి కారణంతో నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదని బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాయకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా రాయకోట సమీపంలోని ఉడయాండహళ్లి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ (41), భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆఫీసులో తీవ్ర పని ఒత్తిడితో నిద్రలేమికి గురయ్యాడు. దీంతో అనారోగ్యానికి గురైన ఇతను పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా స్వస్థత కలగలేదు. జీవితంపై విరక్తి చెందిన విజయ్‌కుమార్ రెండు రోజుల క్రితం స్వగ్రామం రాయకోటకు వచ్చి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు చేరుకొని ఆస్పత్రికి తరలించారు.
జేసీబీకి బాలుడు బలి
కృష్ణరాజపురం: ఆటలాడుకుంటున్న రెండేళ్ల బాలునిపై జేసీబీ దూసుకెళ్లడంతో నూరేళ్లు నిండాయి. ఈ దుర్ఘటన శీగేహళ్లి సమీపంలోని కాడుగోడి మెయిన్ రోడ్డులో జరిగింది. కన్నమంగలకు చెందిన పవన్‌రెడ్డి మృతుడు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఓ జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ బాలుని మీద నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో పసిబాలుడు క్షణాల్లోనే మరణించాడు. అప్పటివరకు గంతులేస్తూ ఉన్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తల్లిదండ్రులు ఏకధాటిగా విలపించారు. మహదేవపుర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చిన్నారి గొంతులో
పిప్పరమెంటు
దొడ్డబళ్లాపురం: రెండేళ్ల చిన్నారి గొంతులో క్యాండి చిక్కుకుని చావు బతుకుల్లో ఉండగా, వైద్యులు దాన్ని తొలగించి ప్రాణాలు కాపాడారు ఈ సంఘటన మంగళూరులోని కక్కింజెలో చోటుచేసుకుంది. చిన్నారి పిప్పరమెంటు చప్పరిస్తూ ఉండగా గొంతులో ఇరుక్కుపోయింది, ఊపిరాడక విలవిలలాడుతున్న బాలికను తల్లితండ్రులు పరుగున ఆస్పత్రికి తీసుకున్నారు, అప్పటికే చిన్నారి నిస్తేజంగా మారిపోయింది. వైద్యులు వెన్ను, కడుపు భాగంలో ఒత్తిడి తెచ్చి క్యాండీ ని తొలగించారు. దీంతో చిన్నారి ఊపిరి తీసుకోవడంతో ప్రాణం దక్కింది.
కూలిన భవనం
కృష్ణరాజపురం: బెంగళూరులో భవన ప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటన జీవన్ బీమా నగర పోలీసు స్టేషన్ పరిధిలోని తిప్పసంద్రలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. ఈ భవనం పక్కన మరో కట్టడం కోసం పునాది తవ్వుతుండగా దీంతో అది కాస్తా కూలింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారిని పోలీసులు, ఫైర్ సిబ్బంది బయటకు పంపించారు. అదృష్టవశాత్తు ఎవరికీ హాని కలగలేదు.
కుంభమేళాకు వెళ్తూ మహిళ దుర్మరణం
కుంభమేళాకు వెళ్తూ మహిళ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment