కెజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో రౌడీషీటర్ శివకుమార్ హత్య కేసు వెనుక ఉన్నది మైనర్ బాలిక, ఒక యువకుడు, ఇద్దరు బాలురు అని తెలిసి పోలీసులు, పట్టణవాసులు అవాక్కయ్యారు. కేజీఎఫ్ పేరును నిలబెట్టారని వ్యంగ్యంగా చెప్పుకొంటున్నారు. సినిమా కథను తలపించే ఈ కేసును పోలీసులు ఛేదించారు. శివకుమార్ (32) ప్రియురాలే హంతకురాలిగా పోలీసులు తెలిపారు.
ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతూ..
జిల్లా ఎస్పీ కేఎం శాంతరాజు వివరాలను వెల్లడించారు. రాబర్ట్‌సన్ పేటలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్న మైనర్ బాలిక (17)ను రౌడీ శివకుమార్ ప్రేమిస్తున్నాడు. తరచూ షికార్లకు తీసుకెళ్లేవాడు. త్వరలోనే పెళ్లి చేసుకుందామని బాలికను ఒత్తిడి చేయగా, ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో ఆమె తన కళాశాలలో చదువుతున్న దీపక్, మరో ఇద్దరు మైనర్‌లతో కలిసి శివకుమార్‌ను హత్య చేయడానికి పన్నాగం పన్నింది. చేపలు తిందాం రా అని శివకుమార్‌ను గత ఆదివారంనాడు బైక్‌లో లాంగ్ డ్రైవ్‌కు తీసుకు వెళ్లింది. సమీపంలోని కామసముద్రం అటవీప్రాంతంలోనికి వెళ్లిన తరువాత ముగ్గురు వెంబడించి కత్తులతో శివకుమార్‌పై దాడి జరిపారు. ప్లాన్ ప్రకారం బాలికను కూడా ఉత్తుత్తిగా బెదిరించారు. శివకుమార్ తీవ్ర గాయాలై పారిపోతూ ఓ చోట పడిపోయి చనిపోయాడు.
తల్లిదండ్రులు లబోదిబో
రౌడీ హత్యాకాండ పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు బాలికను ప్రశ్నించగా ముసుగు వ్యక్తులు వచ్చి హత్య చేసి వెళ్లారని తెలిపింది. పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించారు. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల చిత్రాలను బట్టి నిందితులను గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా, బాలిక సూచనలతో హత్య చేశామని ఒప్పుకున్నారు. మొత్తం నలుగురినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపి విచారణ చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసి జీవితం నాశనం చేసుకున్నారని పిల్లల తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.
హతుడు
శివ (ఫైల్)
రౌడీషీటర్ హత్య వెనుక.. బాలిక,
ఇద్దరు మైనర్లు
విద్యార్థినితో రౌడీ ప్రేమాయణం
పెళ్లికి ఒత్తిడి చేయడంతో హత్యకు
ఆమె కుట్ర
కేజీఎఫ్ క్రైం స్టోరీ!


