హుబ్లీ: డబ్బులిస్తే, ఫేజీ ఫాలో చేస్తే 10వ తరగతి ప్రశ్న పత్రిక ఇస్తామని నకిలీ పోస్టు పెట్టిన 5 ఇన్‌స్టా పేజీలకు వ్యతిరేకంగా ఇక్కడి కమరిపేట పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కేసులు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా అభ్యర్థులను గందరగోళ పరిచే ప్రయత్నం ఇన్‌స్టా పేజ్‌తో పాటు సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నకిలీ ప్రశ్నపత్రికల లీకేజీకి సంబంధించి ఆరోపణలు వెలువడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందినా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో అప్రమత్తమైన హుబ్లీ ధార్వాడ కమిషరేట్ పోలీసులు ఫేక్ పోస్టుల ద్వారా 10వ తరగతి విద్యార్థులను దారి తప్పిస్తున్న 5 ఇన్‌స్టా పేజీలకు వ్యతిరేకంగా ప్రత్యేక కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అంతేగాక స్వయంగా పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ స్పందిస్తూ ఇలాంటి ఫేక్ పోస్టుల వల్ల గందరగోళానికి గురి కాకుండా బాగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు.
ఎన్‌ఆర్‌బీసీకి ఏప్రిల్ ఆఖరు వరకు నీరందించండి
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరితో కలసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి ఇప్పటికే అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నీటి గేజ్ నిర్వహణలో సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదన్నారు. కాలువకు ఏప్రిల్ చివరి వరకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సాగునీటి కోసం ధర్నా
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి గట్టు కాలువ(ఎన్‌ఆర్‌బీసీ) ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్ర పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎండిన వరి దుబ్బులతో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదిలితే రైతులకు రబీ పంట చేతికందకుండా పోతుందన్నారు. నీరందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదన్నారు. కాలువకు ఏప్రిల్ నెలాఖరు వరకు వారబందీ ద్వారా నీరు వదిలి చివరి భూములకు నీరందించాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
మంటల్లో ఫైబర్ కేబుల్ రోల్స్ దగ్ధం
హొసపేటె: కొప్పళ జిల్లా బాణాపుర వద్ద ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో జియో ఫైబర్ కేబుల్ 4 రోల్స్ కాలిబూడిదయ్యాయి. కుకనూరు తాలూకా బాణాపుర గ్రామంలో జాతీయ రహదారి వెంట తళకల్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉంచిన జియో ఫైబర్ కేబుల్ నాలుగు రోల్స్ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో జియో ఫైబర్ కేబుల్ పూర్తిగా కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే అన్ని కేబుళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
చెరువుల అభివృద్ధికి పెద్దపీట
రాయచూరు రూరల్: యాదగిరిలో చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నగరసభ అధ్యక్షురాలు లలిత అనాపురె పేర్కొన్నారు. నగరంలోని లుంబిని చెరువులో మరబోట్ల కార్యాచరణకు శ్రీకారం చుట్టి ఆమె మాట్లాడారు. మరబోట్లతో వేసవి కాలంలో నగర ప్రజలకు ఆహ్లాదం పొందేడానికి, సేద తీరడానికి అవకాశం కల్పించామన్నారు. శాసన సభ్యుడు చెన్నారెడ్డి తన్నూరు మాట్లాడుతూ జిల్లా పాలక మండలి, జిల్లా పంచాయతీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో జల క్రీడలకు ప్రాముఖ్యతనిచ్చామన్నారు. శహాపుర తాలూకా మావిన చెరువు, ఇబ్రహీంపుర, మినాజ్‌పూర్ చెరువులను ప్రజలను ఆకట్టుకొనే విధంగా పర్యాటక శాఖ అభివృద్ధి పరుస్తుందన్నారు. ఈ సందర్భంగా అదనపు జిల్లాధికారి శరణప్ప, పర్యాటక శాఖ అధికారి రామచంద్రలున్నారు.
నకిలీ ఇన్‌స్టా పోస్టుపై ఐదు కేసులు
నకిలీ ఇన్‌స్టా పోస్టుపై ఐదు కేసులు
నకిలీ ఇన్‌స్టా పోస్టుపై ఐదు కేసులు


