బనశంకరి: నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు హెచ్చుమీరాయి. నిరక్షరాస్యులు కాకుండా విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ఐటీ బీటీ ఉద్యోగులు, యువతీ యువకులు, రిటైర్డు ఉద్యోగులు, మహిళలు సైబర్ వలలో చిక్కుకుని లక్షలాది రూపాయలను పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 2024 లో 21,984 సైబర్‌నేరాలు నమోదు కాగా రూ.2,120 కోట్లను సైబర్ వంచకులు దోచేశారు. బెంగళూరులోనే 2023లో రూ.673 కోట్లు కాజేసిన సైబర్ దొంగలు, 2024లో రూ.1,998 కోట్లు నొక్కేశారు. నిత్యం సరాసరి 48 కేసులు నమోదు అవుతున్నాయి. పోలీస్‌స్టేషన్ల వరకు రాని కేసులు లెక్కకు అందవు.
బెంగళూరులో మరీ అధికం
సైబర్ మోసాలు, బాధితుల సంఖ్య ఏటేటా విస్తరిస్తోంది. నగరంలోనే మూడు రెట్లు పెరిగాయి. బెంగళూరులో నిత్యం కొత్త తరహాలో సైబర్ కేటుగాళ్లు వల వేస్తూ పోలీసులకు సవాల్‌గా మారారు. ప్రజలను జాగృతం చేసినప్పటికీ వలలో పడి నగదు కోల్పోతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఓటీపీ చెప్పాలని, మోసపూరిత లింక్‌లను పంపి క్లిక్ చేయించడం, ఫోన్‌ని హ్యాక్ చేయడం ద్వారా డబ్బు కొట్టేస్తున్నారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడితే వారంలో లక్షాధికారులు కావచ్చని నమ్మించి ఎక్కువగా దోచుకుంటున్నారని
సైబర్ ఠాణా పోలీసులు తెలిపారు. మొబైల్‌లో రహస్యంగా కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్ చేసి సిమ్‌కార్డుని, మొబైల్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం పెరిగింది. డబ్బు కట్ అయినప్పటికీ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ వెళ్లదు, దీనివల్ల బాధితులకు మోసం గురించి తెలియదు.
సహాయవాణి 1930
సైబర్ నేరానికి గురైతే తక్షణం 1930 సహాయవాణి కి కాల్ చేసి వివరాలను అందిస్తే నగదు చేజారకుండా కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఆలస్యమయ్యేకొద్దీ వంచకుల ఆచూకీని కనిపెట్టడం సాధ్యం కాదన్నారు. చాలామంది డబ్బు కోల్పోయిన 2–3 రోజుల తరువాత ఫిర్యాదు చేస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు.
ఏటేటా ఆన్‌లైన్ మోసాల వృద్ధి
సంపన్నులు, ఉద్యోగులే లక్ష్యం
విదేశాల నుంచి సైబర్ ముఠాల దాడులు
పట్టుకోలేకపోతున్న పోలీసులు
క్లిక్ చేయగానే లక్షలు లాస్
మోసగాళ్లు పెట్టుబడి పేరుతో పంపించిన లింక్‌పై క్లిక్ చేయగానే ప్రైవేటు టీచరమ్మ రూ.15 లక్షలు పోగొట్టుకుంది.
సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి విక్రయంతో వచ్చిన రూ.1.48 కోట్ల డబ్బును షేర్ల పేరుతో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. పగలూ రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బును పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులు కొన్ని గంటల్లో పోగొట్టుకుంటున్నారు.
బ్యాంకు ఉద్యోగుల ముసుగులో సైబర్ వంచకులు ఐటీ ఇంజినీర్‌కు ఫోన్ చేసి గిప్టు ఓచర్ పంపించి ఫోన్‌ని హ్యాక్ చేశారు, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.2.80 కోట్లు నగదు దోచేశారు.
ముంచేస్తున్న సైబర్ వల
ముంచేస్తున్న సైబర్ వల
ముంచేస్తున్న సైబర్ వల


