దుర్గామాతకు ఉగాది పూజలు
మాలూరు: ఉగాది అమావాస్య కావడంతో తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన శ్రీ దుర్గాదేవి దేవాలయంలో శనివారం విశేష పూజలను నిర్వహించారు. మూల విగ్రహానికి మల్లెలు, కనకాంబరాలు తదితర పుష్పాలతో గండభేరుండ రూపంలో అలంకరించి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పసుపు, గాజులను సమర్పించారు.
కంబీల మధ్య గజ యాతన
మైసూరు: అడవిలో ఉన్న రైలు పట్టాలకు అటు ఇటు ఉన్న ఇనుప కంబీల మధ్యలో చిక్కి అడవి ఏనుగు తీవ్ర ఇబ్బందులు పడింది. మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకాలోని బాడగ గ్రామానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. దగ్గరిలోని అడవిలో నుంచి ఆహారం వెతుక్కుంటూ ఓ ఏనుగు వస్తూ రైలు పట్టాలకు అటు ఇటు అడ్డుగా ఉన్న కంబీలను దాటడానికి ప్రయత్నించి వాటి కింద ఆ భారీకాయం చిక్కుకుపోయింది. ఘీంకారాలు చేస్తూ ఉండడంతో గ్రామస్తులు చూసి అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి ఏనుగును కంబీలను తొలగించి ఏనుగును బయటకు తీయడంతో గండం తప్పింది.
1న గురువందనకు రాజ్‌నాథ్
తుమకూరు: సిద్ధగంగ మఠం దివంగత త్రివిధ దాసోహి శివకుమారస్వామి 118వ గురువందన వేడుకకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని కేంద్రమంత్రి వి.సోమన్న తెలిపారు. శనివారం తుమకూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. మఠంలో ఏప్రిల్ 1వ తేదీన వేడుకలు జరుగుతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని తెలిపారు.
దుర్గామాతకు ఉగాది పూజలు


