గ్యారెంటీలతో ధరలు పెంచి లూటీ
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో లీటరు పాల ధరను ఏకంగా రూ.9 పెంచారని, పాడి రైతులను మాత్రం నడ్డి విరుస్తూ దాదాపు రూ.663 కోట్ల మేర రైతులకు బాకీ ఉన్నారని, వినియోగదారులకు ధరలు పెంచి, రైతులకు అన్యాయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక్క పాల ధరే కాకుండా అన్ని విధాలైన నిత్యావసరాల ధరలు పెంచేశారన్నారు. దీంతో సామాన్యుడి జీవితం అష్టకష్టంగా మారిందన్నారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో పాలకులు లూటీ చేసుకుని పబ్బం గడుపుతున్నారన్నారు. పేదలకు గ్యారెంటీలు సక్రమంగా అందడం లేదన్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వాహన రిజిస్ట్రేషన్లు, ల్యాబ్ పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, దత్తస్వీకార పత్రం, అఫిడవిట్, బస్సు టికెట్ ధరలు, బీర్లు, విద్యుత్ వాహనాలు, నిత్యావసర ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిపై చాప కింద నీరులా ధరలు పెంచుకుంటూ గ్యారెంటీలు ఇస్తున్నామని పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు.ఽ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరల పెంపు పైనే దృష్టి సారిస్తూ సంపద సృష్టించుకుని, కొందరికి మోదం, మరికొందరికి ఖేదంగా పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకే మేలు జరుగుతుందన్నారు. మిగిలిన వారు భారీగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. బీజేపీ నాయకులు డాక్టర్ బీ.కే.సుందర్, డాక్టర్ అరుణ కామినేని, గురులింగనగౌడ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు.
లీటరు పాలపై ఏకంగా రూ.9 పెంపు
ధరల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి


