ప్రైవేటు బస్సు, బైక్‌లు బూడిద
చింతామణి: పట్టణంలోని బెంగళూరు కూడలి ప్రైవేటు బస్టాండులో ఓ ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. అలాగే పక్కన వున్న పది ద్విచక్రవాహనాలు మంటల్లో మాడిపోయాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు బస్సు చింతామణి నుండి హోసకోట పారిశ్రామికవాడలోకి కంపెనీ ఉద్యోగులను తీసుకొని వెళ్లి తిరిగి చింతామణికి వచ్చి నిలబడింది. తెల్లవారుజామున బస్సులో మంటలు చెలరేగి కాలిపోతుండంతో ప్రాంతవాసులు పోలీసులకి తెలిపారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసేటప్పటికి పూర్తిగా కాలిపోయింది. పక్కన పాత పోలీసు స్టేషన్‌లో సీజ్ చేసి ఉంచిన పది ద్విచక్రవాహనాలు నిప్పుపడి కాలి బూడిదయ్యాయి.
సెలవు ఇవ్వలేదని..
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
యశవంతపుర: అక్క కూతురి పెళ్లికి వెళ్లడానికి ఉన్నతాధికారులు సెలవు ఇవ్వలేదనే ఆవేదనతో కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సులోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావిలో జరిగింది. పాత గాంధీనగరకు చెందిన డ్రైవర్ బాలచంద్ర శివప్ప హుక్కోజి (47) మృతుడు. శహపుర నాకా నుంచి వడగావికి వెళ్లే బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బాలచంద్ర ఇంటిలో అక్క కుమార్తె పెళ్లి జరుగుతోంది, ఇందుకు సెలవు కావాలని ఉన్నతాధికారులను అడిగాడు. సెలవు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. ఈ పరిణామాలతో మథనపడి ఆత్మహత్య చేసుకున్నాడని, అధికారులే కారణమని కుటుంబసభ్యులు అరోపించారు. బెళగావి నగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


