దేవర దాసిమయ్య ఆదర్శాలు అనుసరణీయం
బళ్లారిటౌన్: ఆధ్యాత్మిక వచనకారులు, చేనేత సంతతి దేవర దాసిమయ్య ఆధ్యాత్మిక, మానవీయ గుణ గణాలు, ఆదర్శాలను అందరూ అలవరుచుకోవాలని జిల్లా శరణ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కేబీ.సిద్దలింగప్ప పేర్కొన్నారు. బుధవారం కన్నడ సంస్కృతి శాఖ సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన దేవర దాసిమయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ కాలంలో సమాజ అభివృద్ధి కోసం సీ్త్ర సమానతపై ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించిన వారిలో దేవర దాసిమయ్య కూడా ఒకరన్నారు. సమాజంలో మూఢనమ్మకాలను కఠినంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆయన యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జన్మించారన్నారు. చేనేత వృత్తితో శివుడికి నేసిన దుస్తులను అలంకరించి అపూర్వ భక్తుడయ్యారన్నారు. జిల్లా చేనేత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు సీ.దేవానంద మాట్లాడుతూ చేనేత వర్గాలకు మౌలిక సదుపాయాలు మరింతగా కల్పించాలని, విద్యా రంగంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దేవర దాసిమయ్య చిత్రపటానికి పుష్పార్చన సమర్పించారు. కన్నడ సంస్కృతి ఏడీ నాగరాజు, సమాజ నేతలు శీలా బ్రహ్మయ్య, అవార్ మంజునాథ, రాజు, మంజుల, చంద్రశేఖర తదితరులు పాల్గొన్నారు.
సరళంగా దేవర దాసిమయ్య జయంతి
రాయచూరు రూరల్ : దేవర దాసిమయ్య తత్వాలు, ఆదర్శాలను అనుసరించాలని అదనపు జిల్లాధికారి శివానంద పిలుపునిచ్చారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన దేవర దాసిమయ్య జయంతిలో చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. తన వచనాల ద్వారా జీవన మౌల్యాలను గురించి దాసిమయ్య వివరించారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, తహసీల్దార్ సురేష్‌వర్మ, సురేంద్రబాబులున్నారు.
దేవర దాసిమయ్య ఆదర్శాలు అనుసరణీయం


