జిల్లాను తట్టు రహితంగా మారుద్దాం
హొసపేటె: ఈ ఏడాది చివరి కల్లా జిల్లాను మీజిల్స్ రుబెల్లా(తట్టు) రహితంగా మార్చడానికి ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, వైద్యులు సమన్వయంతో పని చేయాలని జిల్లాధికారి దివాకర్ తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ఆడిటోరియంలో జరిగిన తట్టు నిర్మూలన కార్యక్రమం అంతర్ విభాగ సమన్వయ కమిటీ సమావేశం, మాతా శిశు మరణాలపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులు మీజిల్స్ రుబెల్లా రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాను తట్టు రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తల సహకారంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆయుష్ శాఖ గర్భిణులు, పాలిచ్చే మహిళలకు పరీక్ష నిర్వహించాలన్నారు. సురక్షితమైన ప్రసవం, పోషకాహారంపై కౌన్సెలింగ్ అందించాలన్నారు. ఆయుష్ కేంద్రాల్లో గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేసి టీకాలు వేయాలన్నారు. గర్భిణులకు మొబైల్ ఫోన్ల ద్వారా విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వంఇటీవల కిల్కారి యాప్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. యాప్ ద్వారా గర్భిణుల పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రతి గర్భిణి సంరక్షణ కోసం సకాలంలో సలహాలతో పాటు వైద్య చికిత్సలు, ఫాలోఅప్‌లపై ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి ఇది కృషి చేస్తుందన్నారు. జిల్లా వైద్యాధికారి శంకర్‌నాయక్, ఆర్‌సీహెచ్ అధికారి జంబయ్యనాయక్, వైద్యులు హరిప్రసాద్, భాస్కర్, రాధిక, సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.


