బొమ్మనహళ్లి: శ్రవణబెళగొళలో భగవాన్ బాహుబలి స్వామివారి 1,044వ ప్రతిష్టాపన వేడుకల సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని సువర్ణ రథంపైన ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి స్వస్తిశ్రీ అభినవ చారుకీర్తి భట్టారక స్వామీజీ గురువారం రాత్రి శ్రీఫలం అర్పించి ఊరేగింపు ప్రారంభించారు. రథం మధ్య భాగంలో ఉత్సవమూర్తిని ప్రతిష్టాపన చేసి చుట్టు అష్టమంగళం ఏర్పాటు చేశారు. సువర్ణ రథం మొత్తం విద్యుత్ కాంతుల వెలుగులు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ముందు భాగంలో నూతనంగా అర్పించిన రజత దండలు గౌరవ రజతం, చామర మాలలతో ఆకట్టుకున్నాయి. కన్యాశ్రమానికి చెందిన బాలికలు, విద్యాపీఠం బాల బ్రహ్మచారులు ధర్మధ్వజాలు పట్టుకొని సాగారు. వివిధ మంగళ వాయిద్యాల మధ్య మంగళూరు చెండె వాయిద్యం, అరసికెరె చిట్టిమేళ సంగీతం, యువతీ యువకుల నృత్యాలు చేయగా శ్రావణ బాలురు భగవాన్ బాహుబలి స్వామికీ జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు జైన మఠం వద్ద నుంచి భండరి బసది చుట్టు మైసూరు కోనేరు, బెంగళూరు రోడ్డు గుండా ముందుకు సాగింది. అక్కడి నుంచి నేరుగా జైన మఠానికి చేరుకుంది.
ఘనంగా 1,044వ ప్రతిష్టాపన దినోత్సవం


