మణిమకుటం కన్నడ వర్సిటీ
హొసపేటె: చారిత్రక వారసత్వ పరంపరకు ప్రసిద్ధి చెందిన హంపీలో మణిమకుటం లాంటి కన్నడ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం గర్వకారణమని రాష్ట్ర గవర్నర్ ఽథావర్‌చంద్ గెహ్లోట్ అభివర్ణించారు. శుక్రవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయం నవరంగ బయలు ప్రదేశంలో ఏర్పాటు చేసిన కన్నడ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుమారు ఐదు వేల అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, విజువల్ ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు సృష్టించి, ప్రదర్శించిన కళా ఖండాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు. గిరిజన అధ్యయన విభాగం సేకరించిన గిరిజనుల చరిత్ర, స్వదేశీ కవితా వారసత్వాన్ని భావి తరాలకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్నడ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి, హిందీ, ఆంగ్ల భాషల్లో మరింత విలువైన కన్నడ పుస్తకాలను ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం సమీపంలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని, వాటిలో విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆదర్శనీయమన్నారు. అనంతరం విద్యా శాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ హంపీ కన్నడ విశ్వవిద్యాలయం యావత్ కన్నడిగులకు ఆదర్శనీయమన్నారు. ప్రాధ్యాపకులు ఉత్తమ పరిశోధనలపై నిరంతరం దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం విశ్వవిద్యాలయ ప్రతిష్టిత నాడోజ బిరుదులను రాష్ట్ర ప్రసిద్ధ కవి కుంబార వీరభద్రప్పకు, సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ వీ.పాటిల్, ప్రసిద్ధ హిందూస్థానీ గాయకుడు వెంకటేష్ కుమార్‌కు అందజేసి సత్కరించారు.
రాష్ట్ర గవర్నర్ ఽథావర్‌చంద్ గెహ్లోట్
అభివర్ణన
ఘనంగా హంపీ కన్నడ వర్సిటీ
33వ స్నాతకోత్సవం


